22-09-2025 01:18:50 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర పోలీసు వాహనాలు కొత్త రూపం సంతరించుకున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం తెలంగాణ అధికారిక సంక్షిప్త నామాన్ని ‘టీఎస్’ నుంచి ‘టీజీ’గా మార్చిన నేపథ్యంలో, నగర పోలీసు వాహనాలపై కూడా ఈ మార్పును అమలు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు, పాత ‘తెలంగాణ స్టేట్ పోలీస్’ స్టిక్కర్ల స్థానంలో కొత్త ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లను అమర్చారు.
ఈ ప్రక్రియ పూర్తయిన 134 పెట్రోలింగ్ వాహనాలను ఆదివారం సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ అధికారులు పునఃప్రారంభించారు. రాష్ర్ట ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన అన్ని వాహనాలపై కొత్త బ్రాండింగ్‌ను చేపట్టాలని కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ అధికారులు, తమ పరిధిలోని మొత్తం 188 ప్రభుత్వ వాహనాలపై పాత ‘టీఎస్’ స్టిక్కర్లను తొలగించి,
కొత్త ‘టీజీ’ స్టిక్కర్లను అమర్చారు..హైదరాబాద్ సిటీ పోలీసుల వద్ద ఉన్న అన్ని వాహనాలకు ఈ మార్పులు చేసేందుకు సుమారు రూ.1.6 కోట్ల వ్యయం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో కేవలం స్టిక్కర్లు మార్చడమే కాకుండా, వాహనాలకు మెషిన్ పాలిషింగ్ చేయడం, అవసరమైన చోట్ల బంపర్లు, డోర్లకు డెంటింగ్, పెయింటింగ్ వంటి పనులు కూడా చేపట్టి వాటిని పూర్తిస్థాయిలో వినియోగానికి సిద్ధం చేశారు.
కొత్త బ్రాండింగ్‌తో పునఃప్రారంభమైన పెట్రోలింగ్ వాహనాలు నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నిరోధం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. నగరంలో పోలీసుల పటిష్టతను, నిరంతర నిఘాను ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు.ట్రాఫిక్ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్,
పైలట్ వాహనాలతో పాటు ఇంటర్‌సెప్టర్ వాహనాలకు కూడా రాబోయే కొద్ది రోజుల్లో స్టిక్కరింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా, వాహనాలను ఎల్లప్పుడూ శుభ్రంగా, సరైన స్థితిలో ఉంచుకోవాలని డ్రైవర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.