22-05-2025 10:24:00 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అభివృద్ధి అంశాలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పట్టణంలోని ప్రధాన కూడళ్లను సుందరీకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజ్ వంటి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ట్యాంకుల అభివృద్ధి, వీధి లైట్ల ఏర్పాటు, రోడ్ల విస్తరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టంచేశారు. జూన్ 30లోపు గృహ, వాణిజ్య పన్నుల వసూలు వంద శాతాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వార్డులో పారిశుద్ధ్య, డ్రై డే కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని సూచించారు.
వర్షాకాలం దృష్ట్యా దోమల నియంత్రణకు అవసరమైన ఫాగింగ్ మిషన్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. వీధి వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్ ప్రాంతాల్లో తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. ముఖ్య కూడళ్ల వద్ద వ్యర్థాలను పారవేయకుండా డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలనీ సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్ రాజు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.