calender_icon.png 1 August, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ

30-07-2025 01:46:10 AM

  1. నియోజకవర్గానికి ఇద్దరికి అవకాశం 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు చోటు 

ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్  

త్వరలో సీఎంతో మీనాక్షి, పీసీసీ చీఫ్ భేటీ 

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): పార్టీ పదవులు, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీని వీలైనంత తొందరగా పూర్తిచేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ సూచించారు. ప్రభుత్వ పదవుల్లో  ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కచ్చితంగా ఇద్దరికి అవకాశం ఉండాలని, అందులో సామాజిక న్యాయం పాటించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ప్రతి కమిటీ, నామినేటెడ్ పోస్టుల్లో 60 శాతం వరకు 50 ఏళ్లలోపు ఉన్నవారికి అవకాశం ఇవ్వడం జరుగుతుందని మీనాక్షినటరాజన్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉమ్మడి జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, డీసీసీ అధ్యక్షుల, పార్టీ సీనియర్లతో మంగళవారం జిల్లాల వారీగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షినటరాజన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో డీసీసీ అధ్యక్షులు, మండల కమిటీలు, పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని కార్పొరేషన్లు, బోర్డు డైరెక్టర్లు, మెంబర్ల నియామకంపై చర్చ జరిగింది. ప్రభుత్వ, పార్టీ పదవులకు సంబంధించి ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జ్‌లు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో పాటు పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు పలు దఫాలుగా సమావేశాలు .

నిర్వహించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇద్దరు చొప్పున ఆశావాహుల పేర్లను సిఫారస్ చేసిన అంశంపై చర్చించడంతో పాటు వాటికి సంబంధించిన నివేదికలను మీనాక్షినటరాజన్‌కు పీసీసీ చీఫ్  అందజేశారు. ఈ నివేదికలన్నింటిపై రెండు, మూడు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమై చర్చించననున్నారు. ఆ తర్వాత పదవుల భర్తీని ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారు. 

నామినేటెడ్ పోస్టులపై సుదీర్ఘ చర్చ: పీసీసీ చీఫ్

నామినేటెడ్ పోస్టుల భర్తీపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్  తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మహేశ్‌కుమార్ మాట్లాడుతూ బీసీ విషయంలో  బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో ఎమ్మెల్సీ కవిత ఎందుకు మాట్లాడలేదన్నారు.

గంగుల కమలాకర్ పదేళ్లు మంత్రిగా ఉండి బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల వద్దకు కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 31న పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభం అవుతుందని, వరంగల్ జిల్లా వర్దన్నపేటలో ఆగస్టు 6న ముగుస్తుందని తెలిపారు.

ఢిల్లీకి వెళ్లే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తామని మీడియా అడిగిన ప్రశ్నకు మహేశ్ సమాధానమిచ్చారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖేశ్‌గౌడ్, శివశంకర్ విగ్రహం పెట్టాలని అడుగుతున్నారని, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌కు ముఖేశ్‌గౌడ్ ఎంతో సేవ చేశారని ఆయన తెలిపారు.