06-09-2025 12:01:13 AM
- దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట, సెప్టెంబర్ 5 : గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా ప్రజలకు ఇవ్వలేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో నూతన రేషన్ దుకాణాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు.
పేదలు సన్న బియ్యం తినాలని సదుద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం అమలు చేయని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. గత 15 ఏళ్లుగా అప్పంపల్లిలో రేషన్ దుకాణం లేకపోవడం గత ప్రభుత్వ వైపల్యమేనని అన్నారు. గ్రామస్తులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అప్పంపల్లి గ్రామానికి కొత్త రేషన్ దుకాణాన్ని మంజూరు చేశామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని, అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని నూతన రేషన్ డీలర్ స్వాతి సీతన్న కు సూచించారు. అనంతరం దాసర్ పల్లి గ్రామానికి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు .
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, పార్టీ మండల అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, దేవస్థాన చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, తహసిల్దార్ సుందర్ రాజ్, గ్రామ పార్టీ అధ్యక్షులు నరసింహులు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రఘు వర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.