23-05-2025 12:00:00 AM
ఆదిలాబాద్, మే 22 (విజయక్రాంతి): క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఇలాం టి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షులు పరిశీలకులు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ అన్నారు. పార్టీ కోసం కష్ట పడేవారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయని, జెండా మోసిన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని తెలిపారు.
గురువారం యాపల్ గూడలో జరిగిన ఆదిలాబాద్ రూరల్, సాత్నాల, మావల మండలాల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి మరో పరిశీలకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. ముందుగా గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం సమావేశంలో తాహెర్ బిన్ హందన్ మాట్లాడుతూ ఈ మూడు మండలాలలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడే నాయకులు పదవులకు అర్హులన్నారు. నాయకులు, కార్యకర్తలు పదవులు కోసం కాకుండా పనిలో పోటీ పడాలని పార్టీకోసం పని చేయాలని అప్పుడు మంచి కార్యకర్తగా గుర్తింపు వస్తుందన్నారు. పార్టీ ఆదేశాను సారం పని చేయాలని పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా కార్యకర్తల ప్రవర్తన ఉండకూడదని హెచ్చరించారు.
అనంతరం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పరిశీలకులు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ ప్రక్షాళన కోసమే ఈ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆదేశానుసారం జిల్లాలో పార్టీని తిరిగి పటిష్ట స్థితికి చేర్చేందుకు ఈ కార్యక్రమానికి వచ్చినట్టు ఆయన తెలిపారు. జిల్లా, నియోజకవర్గ స్థాయి సమావేశాలు పూర్తి చేసుకున్నామని మండల సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుండి పార్టీ బలో పేతం కావాలంటే ముందుగా అధక్షపదవుల ఎంపిక చేయాల్సి ఉందన్నారు. డీసీసీబీ చైర్మ న్ అడ్డి బోజా రెడ్డి, అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.