06-10-2025 12:06:07 AM
పర్యవేక్షణ లేక అధ్వానంగా మారిన వైనం.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు..
తాండూరు, అక్టోబర్ 5 (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పార్కులు పార్కింగ్ లకు అడ్డాగా మారాయి. పార్కులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పార్కుల్లో ద్విచక్ర, వాహనాలతో పాటు కార్లు, జీపులు, ఆటోలు ఏకంగా పార్కుల్లోనే వాహనదారులు పార్కింగ్ చేస్తున్నారు. పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు సేద తీరేందుకు నిర్మించిన పార్కులు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి.
ఆహ్లాదాన్ని పంచే పార్కులు మురికి కూపాలుగా మారాయి. ఆలన పాలనా చూసేవారు లేక పందులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. పట్టణంలోని శాంతినగర్ అపెక్స్ ఆసుపత్రి సమీపంలో ఉన్న పార్కులో వాహనాలు పార్కింగ్ చేయడంతో పార్కులు కాస్త మైదానంగా మారింది.ఇక మరోవైపు చిన్నారులు ఆడుకునేందుకు పార్కుల్లో ఏర్పాటుచేసిన ఆట వస్తువులు సైతం పాడైపోయి మూలనపడ్డాయి.
పార్కుల నిర్వహణపై పాలకులు, అధికారులు దృష్టి సారించి పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ యాదగిరిని వివరణ కోరగా తాను ఇటీవల బాధ్యతలు స్వీకరించానని త్వరలోనే పార్కుల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచన మేరకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.