calender_icon.png 9 May, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16బార్లకు త్వరలో నోటిఫికేషన్

09-05-2025 02:18:59 AM

-ఆదాయం పెంచుకునేందుకు సర్కార్ కసరత్తు 

-ఒక్కో బారుకు దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు 

-16బార్లలో.. 15 బార్లు హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 

-భారీగా దరఖాస్తులు వస్తాయని అబ్కారీ శాఖ అంచనా 

-ఒక్కో బార్‌తో ఏడాదికి దాదాపు రూ.40 లక్షల ఆదాయం 

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): అబ్కారీశాఖ ద్వారా ప్రభుత్వం మరింత ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. కొత్తగా మరిన్ని బార్లకు అనుమతిచ్చి ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూ ర్చునేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే 16బార్లకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

వీటిలో 15బార్లు హైదరాబాద్ జిల్లాలో ఉండగా, ఒక బార్ మహబూబ్‌నగర్‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఒక్కో బార్‌కు రూ.2 లక్షల చొప్పున దరఖాస్తు ఫీజు నిర్ణయించిం ది. ఏడాదికి ఒక్కో బార్ నుంచి రూ.40లక్షల వరకు సర్కార్ ఖజానాకు చేరనుంది.

ఇప్పటికే హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రంలోని ఉమ్మడి 9 జిల్లాలకు  25 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ..వాటిని లాటరీ తీసి..డ్రాలో గెలుపొందిన వారికి కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,172 బార్లు ఉన్నాయి. ఇటీవలనే ఏర్పాటు చేసిన 25 బార్లు..త్వరలో నోటిఫికేషన్ రానున్న 16 బార్లను కలిపి మొత్తం 1,210 ఉండనున్నాయి. 

ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన 25బార్లకు 1,346 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షల చొప్పున మొత్తం రూ.26.92 కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పుడు విడుదల చేసే నోటిఫికేషన్‌లో 16బార్లకు హైదరాబాద్‌లోనే 15 బార్లు ఉండటంతో.. దరఖాస్తులు రెట్టింపుగా వచ్చే అవకాశం ఉందని, ఆదాయం కూడా పెరుగుతుందని  అబ్కారీశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఒక్కో బార్‌నుంచి ఏడాదికి సుమారుగా రూ.38లక్షల నుంచి రూ.42లక్షల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. అంటే సగటున ఒక్కో బార్‌తో రూ.40లక్షల ఆదాయం వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి లాటరీలో బార్ వచ్చిందంటే ప్రతియేటా రెన్యువల్  మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా 12 వందలకు పైగా ఉండే బార్ల నుంచి ప్రతీఏడాది సర్కార్‌కు ఒక్కో బారు నుంచి రూ.40లక్షల చొప్పున మొత్తం రూ.480కోట్లకు పైగా సర్కార్‌కు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే అంచనాతో అధికారులు ఉన్నారు.