calender_icon.png 22 December, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక పట్టణానికి రాజకీయం!

20-12-2025 12:00:00 AM

ఫిరోజ్ ఖాన్ :

తెలంగాణ రాష్ర్ట రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు క్లిష్టమైన మలుపు వద్ద నిలిచి ఉన్నది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ఇచ్చిన తీర్పు అధికార పార్టీకి మింగుడు పడటం లేదని, అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేసేందుకు కుట్ర జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

గెలిచి న సర్పంచులు డిసెంబర్ 22న ప్రమాణ స్వీకారం చేయబోతుండగా, వెంటనే వెలువడాల్సిన ఎంపీటీసీ షెడ్యూల్‌ను పక్కన బెట్టిన ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల వైపు మొగ్గు చూపడం వెనుక ఆంతర్యం అర్థం కావడం లేదు. పల్లెల్లో పెల్లుబుకుతున్న అ సంతృప్తిని పక్కదారి పట్టించేందుకు 126 మున్సిపాలిటీల్లో ఎన్నికలను ముందుగా నిర్వహించి, పట్టణ ఓటర్లను మేనేజ్ చేయవచ్చనే అంచనాతో సర్కార్ ఉందని విశ్లేష కులు భావిస్తున్నారు. ఈ ‘పల్లె వర్సెస్ పట్ట ణం’ వ్యూహం ప్రభుత్వ అభద్రతా భావానికి నిదర్శనమని, క్షేత్రస్థాయిలో ప్ర జలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తప్పించుకోవడానికే ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

వైఫల్యాలపై గురి!

గ్రామీణ తెలంగాణలో ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం రైతులకు ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారడమేనని ప్రతిపక్షాలు వాదిస్తు న్నాయి. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందకపోవడం, రుణమాఫీ ప్రక్రియలో అనేక సాంకేతిక సాకులు చూపి లక్షలాది మంది రైతులను అనర్హులుగా ప్రకటించడం పల్లెల్లో ఆగ్రహానికి దారితీసింది.

మహారాష్ర్టలోని చంద్రాపూర్ రైతు రోషన్ సదాశివు కేవలం ఒక లక్ష రూపాయల అప్పుతో మొదలై, అది 74 లక్షలకు చేరడంతో తన కిడ్నీని 8 లక్షలకు అమ్ముకున్న ఉదంతం చర్చనీయాం శంగా మారింది. పల్లె ఓటరు తమను నిలదీస్తాడనే భయంతోనే ప్రభుత్వం ఎంపీటీ సీ ఎన్నికలను పక్కన పెట్టి పట్టణాల వైపు దృష్టి సారిస్తోందని, ఇది రైతన్నను మోసం చేయడమేనని బీఆర్‌ఎస్ నేతలు ధ్వజమెత్తారు.

కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల మెరుపులు మెరిపిస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విస్మరించడం వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ఇక్కడి రైతుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు హెచ్చరిస్తున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ల సలహాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసం పంటల మార్పిడి గురించి మాట్లాడటం, రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది.

నిధుల మళ్లింపు.. 

భారతదేశ రాజ్యాంగం కల్పించిన స్థాని క స్వపరిపాలన హక్కులను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని, గ్రామాలకు అందాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను దారి మళ్లిస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఐదంచెల పాలనా వ్యవస్థలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధు ల్లో 70 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకే చేరాలనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రస్తు తం ఆ నిధులు అందక సర్పంచులు అప్పులపాలవుతున్నారు.

మరోవైపు 20 శాతం మండల పరిషత్‌లకు, 10 శాతం జిల్లా పరిషత్‌లకు అందాల్సిన వాటాను కూడా ప్రభుత్వం సక్రమంగా విడుదల చేయడం లేదని, స్థానిక ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని విమర్శలు వస్తు న్నాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడం వల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, ఇది పల్లె ప్రజల్లో తీవ్ర అసహ నానికి దారితీసిందనిపిస్తుంది.

పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీలు, కనీస వసతులు కల్పించలేని ప్రభుత్వం, పట్టణాల్లో భారీ ప్రాజెక్టుల పేరుతో కాలయాపన చేస్తోందని, ఇది ప్రాంతీయ వివక్షను పెంచడమేనని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. అధికార వికేం ద్రీకరణ ద్వారా గ్రామాల అభివృద్ధి జరగాలన్న లక్ష్యం కాగితాలకే పరిమితమైందని, స్థానిక సంస్థలకు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వారు వాదిస్తున్నారు.

ప్రజాధనం వృథా..

రాష్ర్టం ఆర్థిక సంక్షోభంలో ఉందని చెబుతూనే, ప్రచార ఆర్భాటాల కోసం సుమారు 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేసిందన్న విమర్శ లు పెరిగిపోయాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ పర్యటన కోసం సింగరేణి సంస్థ నుంచి 10 కోట్లు, ఎంసీహెచ్‌ఆర్డీలో ప్రత్యేక కోర్టు కోసం 5 కోట్లు మళ్లించడం వెనుక మతలబు ఏంటనేది ప్రశ్నగా మిగిలింది.

గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల భవనాలు కూలిపోతున్నా, ఆసుపత్రుల్లో మందులు లేకపోయినా పట్టించుకోని ప్రభుత్వం, కేవలం బ్రాండిం గ్ పేరుతో ఇటువంటి ఆడంబరాలకు ప్రా ధాన్యత ఇవ్వడం దారుణం. మెస్సీ విడుదల చేసిన వీడియోలో కూడా ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డితో ఆడిన దృశ్యాలు లేకపోవడం, కేవలం ఫొటోల కోసమే కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును ధారపోశారనడానికి ఇదే నిదర్శనమని చెప్పొచ్చు. పట్టణాల్లో ఇటువంటి మెరుపులు మెరిపించి ఓట్లు రాబట్టుకోవాలనే వ్యూహం పల్లె ప్రజలను అవమానించడమేనని, ప్రజల పన్నుల సొమ్ముకు జవాబుదారీతనం లేకపోవడం ప్రభుత్వ నిరంకుశ ధోరణికి పరాకాష్టగా భావించొచ్చు.

బీసీలు బుద్ధి చెప్పాలి..

బీసీ కుల గణన, రిజర్వేషన్ల విషయం లో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు 50 శాతం లోపు నిబంధనల పేరుతో కాలయాపన చేయడం వెను క బీసీ ఓట్లు చేజారిపోతాయనే భయం దాగి ఉందనేది సత్యం. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని..

ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల్లో గట్టి గుణపాఠం తప్పందని భావించే ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల సాకుతో తప్పించుకుంటుందేమోననిపిస్తున్నది. సామాజిక న్యాయం గురించి మా ట్లాడే నాయకులు క్షేత్రస్థాయిలో అధికారాల బదలాయింపుకు వచ్చేసరికి మాత్రం వెనకడుగు వేయడం వారి ద్వంద్వ విధానాలకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూడటం సమంజసం కాదని, రాబోయే ఎన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెప్పే అవకాశముంది. 

అభివృద్ధికి అడ్డు..

మొత్తానికి ‘పల్లె వర్సెస్ పట్టణం’ సమీకరణం ద్వారా తెలంగాణ రాజకీయాలను రెండుగా చీల్చాలని ప్రభుత్వం చూస్తోందని, ఇది అభివృద్ధికి అడ్డుగా నిలిచే అవ కాశముందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే పల్లెల్లో కనిపించిన వైఫల్యాలను పట్టణాల్లో ప్రచారాలతో కప్పిపుచ్చలేరన్న విషయం గ్రహించాలి. ప్రతి అంశాన్ని ఓటర్లు నిశితంగా గమనిస్తున్నారు. స్థానిక ఎన్నికలను నిర్ణీత సమ యంలో నిర్వహించకుండా, తమకు అనుకూలమైన చోట మాత్రమే ముందుగా జరపాలని చూడటం ప్రజాస్వామ్య వ్యవస్థపై సర్కారుకు ఉన్న అపనమ్మకాన్ని సూచిస్తోంది.

ప్రజల ఆకాంక్షలకు భిన్నం గా, కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసమే వ్యూహాలు పన్నుతున్నారని, ఇది అంతిమంగా ప్రభుత్వ పతనానికే దారితీస్తుందన్న విశ్లేషకులు భావిస్తున్నారు. పల్లె ఓటర్లు ఇప్పటికే తమ నిరసనను వ్యక్తం చేశారని, ఇప్పుడు పట్టణ ఓటర్లు కూడా వాస్తవాలను గ్రహించి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ప్రతిపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఏ ప్రభుత్వం కూడా ప్రజల ప్రాథమిక సమస్యలను విస్మరించి చిరకాలం అధికారంలో ఉండలేదని, రాబోయే తీర్పు ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తుందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అంతిమంగా రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల ముగింపుతో రాజకీయం ఇప్పు డు పల్లెల నుంచి పట్టణానికి పాకిందనడంలో సందేహం లేదు.