calender_icon.png 28 September, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పుడు వీసా బాదుడు

21-09-2025 12:00:00 AM

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక ఫీజును లక్ష డా లర్లకు పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఆదివారం నుంచే ఈ నిబంధన అమల్లోకి రానున్నట్టు ట్రంప్ కార్యవర్గం పేర్కొనడం గమనార్హం. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నామని, దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు.

ఈ నిర్ణయం భారత్‌తో పాటు చైనాపై అధిక ప్రభావం చూపనుంది. ఎందుకంటే హెచ్-1బీ వీసా దారుల్లో భారత్ అత్యధికంగా 71 శాతం వాటా కలిగి ఉండగా.. చైనా 11.7 శాతం వాటాను కలిగి ఉంది. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్-1బీ వీసా తీసుకొచ్చారు. అమెరికాలో టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తారు. ఈ వీసాను మూడేళ్ల నుంచి ఆరేళ్ల కాలానికి మంజూరు చేస్తారు.

అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికానే ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశముందని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ సహా పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. హెచ్-1బీ వీసా ఫీజు పెంపు అమెరికాకు నష్టం కలిగిస్తుందని.. దీనివల్ల నైపుణ్యతకు కొదువ లేని భారత్‌కు ల్యాబ్స్, పేటెంట్లు, నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లు విరివిగా వచ్చే అవకాశముంటుందని తెలిపారు. అమెరికాలో ప్రతీ టెక్ కంపెనీలో మన భారతీయులే అధికంగా పనిచేస్తున్నారు.

తాజాగా హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో అక్కడి టెక్ కంపెనీలు అంత ఫీజు కట్టి విదేశీయులను అట్టిపెట్టుకొని పని చేసే సాహసం చేయకపోవచ్చు. దీంతో చాలా మందిని వెనక్కి పంపించే అవకాశముంది. ఈ నిర్ణయం భారత్‌కు శరాఘతమైనప్పటికీ స్వదేశీ కంపెనీల్లోనే మన టెక్ ఇంజినీర్లు పనిచేయడం వల్ల ఎకానమీలో భారత్ జీడీపీ పరుగులు పెట్టే అవకాశముంది. మరోవైపు హెచ్-1బీ వీసా ఫీజు పెంపు భారత టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది.

అంతేకాదు అమెరికాలో మాస్టర్స్, పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత హెచ్ -1బీ వీసాలకు మారేందుకు ప్రయత్నించే కమ్యూనిటీలో అత్యధికులు భారతీయులే. తాజాగా ట్రంప్ నిర్ణయం వీరికి మింగుపడని అంశం. హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో వీరి కెరీర్ అవకాశాలకు గండిపడొచ్చు. దీంతో చదువు ముగించుకున్న విద్యార్థుల్లో నైపుణ్యత ఉంటేనే ఆయా టెక్ కంపెనీలు భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశముంది.

ప్రఖ్యాత టెక్ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టులో ఉంచడానికి చాలా కాలంగా హెచ్-1బీ వీసాలను ఉపయోగిస్తున్నాయి. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయా కంపెనీలకు పెను భారంగా మారనుంది.

అంతిమంగా ‘అమెరికాలోని గొప్ప యూనివర్సిటీల్లో పట్టభద్రులైన స్థానిక యువత నైపుణ్యతను గుర్తించి వారికే ముందుగా ఉద్యోగాలు ఇవ్వాలి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న ఇతర దేశాల వారిని తీసుకురావడం ఆపేయాలి’ అని యూఎస్ కామర్స్ సెక్రటరీ హో వార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు. దీన్నిబట్టి హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ఎందుకంత కఠినంగా వ్యవహరించారనేది అవగతమవుతోంది.