21-09-2025 12:00:00 AM
డాక్టర్ తిరునహరి శేషు :
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలంతా ఒక కాంక్షలా పోరాడి సాధించుకున్నారు. రాష్ర్ట సాధన పోరాటంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పోరాడారు. కానీ రాష్ర్టం ఏర్పాటు అయిన తర్వాత జనాభాలో 83 శాతం ఉన్న బీసీ వర్గాలకు మాత్రం అధికారం దక్కకపోవడం శోచనీయం.
ప్రజాస్వామ్యంలో ఏ భావజాలమైనా, కులమైనా, వర్గమైనా అ ధికారంలోకి రావడానికి పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో పోటీ చేయడం ఒక మార్గం. రాజకీయంగా అధికారంలోకి రాలేని కులా లు, వర్గాలు మనుగడ సాగించలేవని భార త రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన మాట అక్షరసత్యంగా కనబడుతుంది. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన జాతీయ పార్టీల ఏలుబడిలో కానీ, రాష్ట్రాన్ని పాలించిన ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో కానీ మెజార్టీ వర్గాలైన బలహీనవర్గాలకు అధికారం, అవకాశాలు, ఆర్థికంలో సరైన ప్రాధాన్యత దక్కలేదనే అసంతృప్తి గూడుకట్టుకొని ఉన్నది.
అణిచివేత నుంచే తిరు గుబాటు మొదలవుతుందని చరిత్ర చెబుతుంది. బీపీ మండల్ చెప్పినట్లు సామాజి క వెనకబాటుతనంపై పోరాటం బలహీన వర్గాల మెదళ్ల నుంచి ప్రారంభం కావాలి. తమపై జరుగుతున్న అణిచివేతకు, వెనకబాటుతనానికి వ్యతిరేకంగా పోరాడటానికి రాజ్యాధికారాన్ని చేపట్టడానికి ఒక పార్టీ కావాలనే కాంక్షకు ప్రతిరూపంగా బీసీల కేంద్రంగా ఒక పార్టీ పురుడు పోసుకోవ డం మార్పుకు సంకేతమనే చెప్పొచ్చు.
సెప్టెంబర్ 17న హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ విమోచన దినం రోజునే కొంతకాలంగా బీసీల అజెండాని బలంగా వినిపి స్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేతృత్వంలో ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) ఏర్పాటును ఎలా చూడాలి? ఎంత మేరకు ఆ పార్టీ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది? రాబోయే 2028 తెలంగాణ రాష్ర్ట శాసనసభ ఎన్నికల నా టికి ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
మూడు పార్టీలదే ఆధిపత్యం
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలంతా ఒక కాంక్షలా పోరాడి సాధించుకున్నారు. రా ష్ర్ట సాధన పోరాటంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ముందు వరుసలో బరిగీసి పోరాడారు. కానీ రాష్ర్టం ఏర్పాటు అయిన తర్వాత రాష్ర్ట జనాభాలో 83 శాతం ఉన్న ఈ వర్గాలకు అధికారం దక్కలేదు. అధికారంలోనూ, అభివృద్ధి సంక్షేమ ఫలాల్లో న్యాయమైన వాటా దక్కలేదు. రాష్ర్టంలో రాజకీయమంటే ఆ మూడు పార్టీలదే అన్నట్టుగా వాతావరణాన్ని సృష్టించారు.
దశాబ్ద కాలంగా రాష్ర్టంలో ఆ మూడు పార్టీలు అనుసరిస్తున్న వైఖరికి అసంతృప్తి చెందిన మెజార్టీ ప్రజలైన బలహీన వర్గా లు తమ రాజకీయ అస్తిత్వం కోసం బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని బలంగా ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలోచనలో పడిన ఆ మూడు రాజకీయ పార్టీలు బీసీల ఓట్ల కోసం బీసీల కేంద్రం గా రాజకీయాలకు తెర తీశాయి.
2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా గెలుపు కోసం ప్రధాన రాజకీయ పక్షాల్లో ఒకటి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తే మరొక పార్టీ ఒక అడుగు ముందుకేసి బీసీని ముఖ్యమంత్రి గా ప్రకటించారు. ఒక దశాబ్దం పాటు తెలంగాణను పాలించిన ప్రాంతీయ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోకపోగా ఎన్నికలకు ముందు ‘బీసీ బంధు’ లాంటి పథకాలు ప్రకటించి బీసీ అంశాన్ని ఎత్తుకున్నది.
జాతి ఆధారిత కుల గణన, స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లాంటి అంశాలు తెలంగాణ రాష్ర్టంలో బీసీ వాదానికి మరింత బలం చేకూర్చటమే కాదు బీసీ ఫ్యాక్టర్ తెలంగాణలో భవిష్యత్తు రాజకీయాన్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్లిన నేపథ్యంలో సహజంగానే ఆ మూడు పార్టీల ను నమ్మాలా వద్దా! అనే మీమాంసలో ఉన్న బలహీన వర్గాలకి తమ రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టే పార్టీలు ఏర్పాటు రాజకీయ పరిణితిగా చూడాలి.
రాజకీయ పార్టీ అవసరమా?
తెలంగాణ రాష్ర్టంలో బలంగా ఉన్న రెండు జాతీయ పార్టీలు రాష్ర్టం ఏర్పాటైన తర్వాత ఒక దశాబ్దం పాటు అధికారాన్ని చెలాయించిన ఒక ప్రాంతీయ పార్టీ ఉండగా బీసీల పార్టీగా తెరపైకి వస్తున్న కొత్త పార్టీ మనుగడ సాధించగలుగుతుం దా? పార్టీ అవసరమా అనే వాదన కూడా వినిపిస్తుంది. పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో, 21 నెలల కాంగ్రెస్ పాలనలో మెజార్టీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం, అవసరాలు, ఆకాంక్షలు ఆ పార్టీల అజెండాలో లేనప్పుడు ఏమి చేయాలి? జనం మనది, బలం మనది..
అధికారం వారిదా? అం దుకే పార్టీ రావాలనేది బలహీన వర్గాల ఆకాంక్ష. ఇప్పటివరకు పాలించిన పార్టీల అజెండాలో బీసీలు ఉంటే కుల గణన డిమాండ్ సాధించడానికి ఏడు దశాబ్దాలకు పైగా పడుతుందా? నాలుగు దశాబ్దా లుగా మండల్ కమిషన్ సిఫారసులు అమలులోకి రాకుండా ఉంటాయా? కా మారెడ్డి బీసీ డిక్లరేషన్ లోని ఒక్క హామీనైనా అమలు చేశారా? 2013లో నాటి ప్రభుత్వం హామీ ఇచ్చిన బీసీ సబ్ ప్లాన్ అమల్లోకి రాకుండా పోతుందా? 56 శాతం ఉన్న బీసీల సంక్షేమానికి రాష్ర్ట బడ్జెట్‌లో మూడు శాతం కంటే తక్కువ నిధులు కేటాయింపు జరుగుతుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 16 మంది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఇద్దరు..
మొత్తంగా 69 సంవత్సరాల్లో 18 మంది ముఖ్యమంత్రుల్లో ఒక్క సారి కూడా బీసీకి ముఖ్యమం త్రిగా అవకాశం దక్కకపోవడం బాధాకరం. 119 శాస నసభ స్థానాల్లో బీసీలు కేవలం 21 మంది మాత్రమే ఎందుకు ఉన్నారు? బీసీ విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంక్షలు ఎందుకు? సంచార జా తుల కా ర్పొరేషన్‌ను అటకెక్కిస్తారా అన్న ప్రశ్నల కు, అణిచివేతకు సమాధానంగా మల్లన్న కొత్త పార్టీ ఆలోచనకు మొగ్గ తొడిగిందని చెప్పొచ్చు.
బీసీ కేంద్రంగా రాజకీయం
రాష్ట్రంలోని అన్ని పార్టీలు బీసీలకు అ న్యాయమే జరిగిందని ఒప్పుకుంటున్నా యి, కానీ ఆ అన్యాయానికి బాధ్యత తీసుకోవటానికి మాత్రం ఏ పార్టీ ముం దుకు రావడం లేదు. బీసీల జెండాతో పార్టీ పెట్టగానే దానిని బలహీనపరిచే ఎత్తుగడలను అప్పుడే ప్రారంభించడం గమనార్హం. బీసీ ల అభ్యున్నతి కోసం పార్టీలు ఏర్పాటు చేసిన ఆలె నరేంద్ర, విజయశాంతి, దేవేందర్ గౌడ్‌ల వైఫల్యాలను ప్రస్తావిస్తూ మల్లన్న పెట్టిన పార్టీ కూడా అదే కోవలోకి వెళ్లాలని కోరుకోవడం దారుణమని చెప్పొచ్చు.
బీసీల కేంద్రంగా వారి హక్కుల కోసం, అ ధికారం కోసం, సామాజిక న్యాయం అనే బలమైన అజెండా వేదికగా తరతరాల అణిచివేతకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన పతాకంలా ఈ కొత్త పార్టీని చూడాలి. అగ్రవర్ణాల పేదలతో సహా బ హుజన వర్గాల కోసం వారి రాజ్యాధికారం కోసం పుట్టిన పార్టీగా స్వాగతించాల్సిన అవసరముంది.
వ్యాసకర్త సెల్: 9885465877