calender_icon.png 9 January, 2026 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమిళనాట వి‘చిత్ర’ రాజకీయం

08-01-2026 12:54:27 AM

రెండు సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ల జారీలో అభ్యంతరాలు  

నేడు ‘జన నాయగన్’ రిలీజ్ అయ్యేనా? 

‘పరాశక్తి’ విడుదలకు అడ్డంకులు తొలిగేనా?  

సినిమా ప్రతినిధి, జనవరి 7 (విజయక్రాంతి): తమిళ నాట సినిమాల చుట్టూ రాజకీయం ఆసక్తికర చర్చకు తెర తీసింది. తమిళ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’, శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ముఖ్యంగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ను సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉండగా.. ఇప్పటివరకూ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ సినిమా సెన్సార్ వివాదంపై బుధవారం మద్రాసు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది.

జనవరి 9న ఉదయానికి తుది ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా గత డిసెంబర్‌లోనే సెన్సార్ బోర్డుకు వెళ్లగా.. కొన్ని సన్నివేశాలు, సంభాషణలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ ఆ మార్పులు చేసి మళ్లీ బోర్డుకు సమర్పించింది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సెన్సార్ బోర్డు నుంచి స్పందన రాకపోవటంతో చిత్ర నిర్మాణ తరఫున మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. దీనిపై వాదనలు జరిగాయి. ‘మీరు సూచించిన మేరకు ఇప్పటికే సినిమాలో మార్పులు చేశారు కదా’ అని కోర్టు.. అదనపు సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించింది. దీంతో “జన నాయగన్’ చూసిన సభ్యుల్లో ఒకరు సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని రివిజన్ కమిటీ పరిశీలించాలి. ఆ తర్వాతే తదుపరి దశకు వెళ్తుంది. ఇంకా ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే అది చట్ట ప్రకారం జరుగుతుంది.