calender_icon.png 9 January, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టికెట్ ధరలు పెంచుకోవచ్చు

08-01-2026 12:57:06 AM

సంక్రాంతికి విడుదల కానున్న సినిమాల్లో ప్రధానమైన ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలకు హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు వర్తించదని స్పష్టం చేసింది. ‘పుష్ప2’, ‘ఓజీ’, ‘గేమ్ ఛేంజర్’, ‘అఖండ2’లకే ఈ తీర్పు వర్తిస్తుందని వెల్లడించింది. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ‘ది రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసా ద్ గారు’ చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ వేర్వేరుగా పిటిషన్లు వేశారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం హోమ్‌శాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోమ్‌శాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన తీర్పును ఆ చిత్రాల వరకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

దీంతో ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లభించింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ’ది రాజాసాబ్ ’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ జనవరి 12న విడుదల కానుంది. 

ఏపీలో ‘రాజాసాబ్’కు అనుమతులు జారీ.. 

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల టికెట్ ధరల పెంపు, ప్రీమియర్స్ విషయమై ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజాసాబ్ టికెట్ ధరలను పెంపునకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. జనవరి 9న ఈ సినిమా విడుదల కానుండగా, 8న రాత్రి స్పెషల్ ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.

సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యలో ఒక షోకు అనుమతి ఇచ్చింది. స్పెషల్ ప్రీమియర్స్ టికెట్ ధరను రూ.1000గా నిర్ణయించారు. జనవరి 9 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీఫ్లెక్స్‌లలో రూ.200 పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. పన్నులతో కలిపి ఈ ధరలు వర్తిస్తాయి. ఇక రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది.