02-09-2025 12:00:00 AM
-విద్యార్థులు తక్కువ.. ఇండెంట్ ఎక్కువెందుకు..?
-కుల్లిన కూరగాయలు.. కల్తీ కారం పొడి
-హాస్టళ్ల నిర్వాహనపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అసహనం
-అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని ఉన్న హాస్టళ్ల ఆకస్మిక తనిఖీలు
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 1: బీసీ హాస్టళ్లలో బియ్యం నిల్వలపై విజిలెన్స్ ఎన్స్‌ఫోర్‌మెంట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎన్స్‌పోర్‌మెంట్ ఎస్పీ (స్పెషల్ ఫోర్స్) అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, డీఎస్‌వో వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్ లక్ష్మయ్య మరియు స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఇంద్రాణిలతో కూడిన అధికారుల బృందం బాటసింగారంలో ఉన్న చంద్రాయన్‌గుట్ట, నాంపల్లికి చెందిన బీసీ వెల్ఫర్ హాస్టళ్లను అధికారులు తనిఖీలు నిర్వహించారు.
హాస్టళ్లలో అధికంగా బియ్యం నిల్వలు ఉండడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందాల్సిన బియ్యం కంటే ఎక్కువ మొత్తంలో బియ్యం నిల్వ చేయడంతో బియ్యం పక్కదారి పడుతున్నాయి అన్న అనుమానాలను వ్యక్తం చేశారు. ఆగస్టు 31వ తేదీ వరకు బియ్యం పూర్తి ఖాళీ కావాల్సి ఉండగా.. ఇంకా గోదాంలో 100కు పైగా బియ్యం బస్తాలు ఉండడం వల్ల అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు.
కూరగాయల స్టోర్ రూం కూడా పరిశీలించి.. అందులో కుల్లిన ఉల్లిగడ్డ, ముదిరిన సొరకాయలు పిల్లలకు ఎలా వండిపెడుతారని ప్రశ్నించారు. అదే విధంగా ఆశీర్వాదం కారంపొడి కూడా కల్తీ కారంపొడి వాడడంపై హాస్టళ్లు సిబ్బందిని నిలదీశారు. మీ ఇంట్లో ఇలాగే వాడుకుంటారని.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని శివమెత్తారు. అదేవిధంగా విద్యార్థులకు రోజువారిగా అందించాల్సిన ఆహారాన్ని హాస్టల్ సిబ్బంది సరిగా రికార్డులు మెయింటెన్ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే విధంగా ఎల్బీనగర్ బీసీ వెల్ఫర్ హాస్టల్‌లో తనిఖీలు నిర్వహించగా.. అందులో విద్యార్థులకు అందించే గుడ్డు చిన్నగా ఉండడంపై, పురుగు పట్టిన కంది పప్పును వాడడంపై ప్రిన్సిపల్ వెంకట్‌రెడ్డి మందలించారు. విద్యార్థులకు తగిన విధంగా హాజరు పట్టికలో సరిగా వివరాలు లేకపోవడంతో అధికారులు పలు విధాలుగా ప్రశ్నించారు. మళ్లీ ఈ తప్పిదాలు పునరావృత్తం కాకుండా చూసుకుంటామని ప్రిన్సిపల్, సిబ్బంది తెలిపారు. అదే విధంగా బాటసింగారం గ్రామంలో ఉన్న ఎస్పీ హాస్టల్‌లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం తమ దృష్టికి వచ్చిన వివరాలను రాతపూర్వకంగా రాసి సంతకాలు తీసుకున్నారు.