calender_icon.png 9 January, 2026 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు.. మాఫియా కుమ్మక్కు

08-01-2026 12:13:53 AM

  1. రాత్రి ,పగలు లేకుండా మట్టి తోలకాలు
  2. రియల్ ఎస్టేట్ భూములకు సీతారామ ప్రాజెక్టు మట్టి
  3. అనుమతులు ఇవ్వలేదంటున్న రెవెన్యూ శాఖ
  4. గోరంత అనుమతులు.. కొండంత అక్రమ రవాణా

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 7 (విజయక్రాంతి): అధికారుల మధ్య సమన్వయ లోపం, మట్టి మాఫియా తో అధికారులు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మట్టి తోలకాలు యదేచ్చగా సాగుతున్న పట్టని అధికారుల వైనం అనేక అనుమానాలకు, ఆరోపణలకు దారితీస్తోంది.  లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని నామమాత్రపు అనుమతులతో తోలుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రాంతంలో సీతారామ ప్రాజెక్ట్ మట్టిని అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం కలకలం రేపుతోంది. ఇరిగేషన్ అధికారులు పాల్వంచకు చెందిన లారీ యజమానులు కుమ్మక్కై వేల సంఖ్యలో లారీల మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చే అనుమతులు గోరంత మాత్రమే ఉంటే, వాస్తవంగా జరుగుతున్న మట్టి తరలింపు మాత్రం కొండంతగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనుమతుల పేరుతో కొద్ది లారీలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ఆ అనుమతులను అడ్డం పెట్టుకుని వందల లారీలను యదేచ్చగా నడుపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి బుధవారం పాల్వంచ మండల పరిధిలోని సోములగూడెం వద్ద జరిగిన సంఘటన అద్దం పడుతోంది. ఫారెస్ట్ అధికారులు అనుమానంతో మట్టి లారీలను ఆపి పరిశీలించగా, మూడు లారీల్లో ఒక్క లారీకి మాత్రమే చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉండగా, మిగిలిన రెండు లారీలకు ఎలాంటి అనుమతులు లేవని తేలింది. దీంతో ఫారెస్ట్ అధికారులు ఆ రెండు లారీలను తమ అదుపులోకి తీసుకున్నారు. 

అయితే, ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. లారీ యజమానులు వెంటనే ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేయడంతో, అనుమతి లెటర్ పంపిస్తాం అంటూ హామీ ఇవ్వడం వెనుక అధికారలారీ యజమానుల మధ్య జరుగుతున్న లావాదేవీలు బహిర్గతమయ్యాయి అని స్థానికులు వ్యాఖ్యానిస్తు న్నారు. మరింత ఆశ్చర్యకరంగా, ఫారెస్ట్ అధికారులు కూడా లారీలను సీజ్ చేయకుండా లెటర్ వచ్చాక చూసి పంపుతాం అని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇరిగేషన్, ఫారెస్ట్ శాఖల మధ్య సమన్వయం పేరుతో అక్రమాలకు అడ్డుగోడగా నిలవాల్సిన వ్యవస్థే, అక్రమ రవాణాకు మార్గం సుగమం చేస్తోందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి, అనుమతుల జారీ నుంచి మట్టి తరలింపు వరకు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మట్టి అక్రమ రవాణాపై పాల్వంచ తాసిల్దార్ ధారా ప్రసాదం వివరణ కోరగా తాము మట్టి తరలింపులకు ఎలాంటి అనుమతులు ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై సీతారామ ప్రాజెక్టు కొత్తగూడెం జిల్లా ఎస్ ఇ శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా సీతారామ ప్రాజెక్టు మట్టి తోలకాల విషయం తన నోటీసులో లేదని, సంబంధిత ఈ ఈ లతో మాట్లాడే విషయం తెలుసుకొని చర్యలు తీసుకుంటామన్నారు.