08-01-2026 12:12:03 AM
రెండు రోజుల కిందట పార్టీ మారిన ఐదుగురు బీఆర్‌ఎస్ కార్పోరేటర్లు
తుమ్మల నేతృత్వంలో చక్రం తిప్పేందుకు కాంగ్రెస్ పావులు
ఖమ్మం, జనవరి 7 (విజయక్రాంతి): కేటీఆర్ ఖమ్మం పర్యటన సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ అవటంతో, కేటీఆర్ కు షాక్ తగిలినట్లయింది. రెండు రోజుల కిందట ఓ ఐదుగురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. మరో ముగ్గురు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
కేటీఆర్ పర్యటన ఉందని తెలిసిన తర్వాతే బీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్లోనికి జంప్ అవుతుండటం, కేటీఆర్ కు గానీ, ఖమ్మం ముఖ్య నాయకులకు గానీ ఖమ్మం పై పట్టు లేదనడానికి నిదర్శనమనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం అంతా తుమ్మల కన్సన్లోనే జరుగుతోందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగరేసేందుకు ముందస్తు సన్నాహకమనే తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతుండగా, బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మ రక్షణలో పడింది. ఎంతమంది పోయిన ఎంతమంది వచ్చినా తమ పార్టీకి ఏమీ జరగదని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, లోపల మాత్రం అంతర్మదనంలో పడినట్లు తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లోనే ఎనిమిది మంది కార్పోరేటర్లు కారు పార్టీకి టాటా చెప్పి కాంగ్రెస్ కండువా కప్పేసుకోవడంతో.. బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
ఇక ఇదే సమయంలో పార్టీని వీడిన వాళ్లు, తమకు మంచి పనిచేశారంటూ బీఆర్‌ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. కార్పోరేటర్లు బీఆర్‌ఎస్ను వీడి, కాంగ్రెస్లో చేరటంతో ఖమ్మం నగర రాజకీయాలో హై డ్రామాకు తెరతీశాయి.
చక్రం తిప్పుతున్న తుమ్మల..
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కప్పదాట్లు సహజం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనికి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు జంప్ అవుతుంటారు. స్థానిక నాయకుడిని బట్టి పార్టీ చేరికలు ఆధారపడి ఉంటాయి. ఖమ్మం నియోజకవర్గం లో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉండటంతో ఆయన మార్కు రాజకీయం ప్రదర్శిస్తున్నారని ప్రచారం సాగుతోంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారూ. అయితే ఆయనకు ఉన్న చరిష్మా తెలిసిన, అప్పటి టిఆర్‌ఎస్ అధిపతి సీఎం కేసీఆర్ తుమ్మలను పిలిచిమరీ మంత్రి పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత తుమ్మల తన మార్కు రాజకీయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ను బలోపేతం చేశారు. మళ్లీ 2018 లో జరిగిన ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి తుమ్మల ఓడిపోయారు. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు నుంచి కొద్ది రోజులు కాస్త దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయనను 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు పార్టీలోకి ఆహ్వానించారు.
ఆ ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల, అప్పటి నుంచి నియోజకవర్గంలో దీటైన రాజకీయం చేస్తున్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో, ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ కార్పొరేటర్ లను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. ఆయనే దగ్గరుండి మరి కార్పొరేటర్ లను హైదరాబాదుకు తీసుకు వెళుతూ పార్టీ కండువాలు కప్పే కార్యక్రమాలను జరిపిస్తున్నారు. ఆయన దూకుడు చూస్తుంటే ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ దాదాపు ఖాళీ అయ్యేలా కనిపిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తుమ్మల మార్కు రాజకీయంతో ఖమ్మం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మంది ఎక్కువైతే..
కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి కొత్త నొప్పులు తెరిచి పెడతాయన్న ప్రచారం సాగుతోంది. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీతోనే కొనసాగి, పార్టీని గెలిపించిన వారికి ఈ చేరికలు పెద్దగా నచ్చటం లేదు. కొత్తవారు పార్టీలకు చేరిన తర్వాత వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చి తమను ఎక్కడ పట్టించుకోకుండా వదిలేస్తారేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు ఏ నాయకుడైనా పార్టీ వెంట కొనసాగేది నామినేటెడ్ సీట్లు లేదా ఆయా ఎన్నికల్లో సీట్లు దక్కుతాయన్న ఆశతోనే! తాజా చేరికలు ఎక్కువ తమ సీట్లకు ఎసరు పడుతుందోనని చాలామంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఇదే ఎక్కువైతే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మంత్రులకు ముఖ్య నాయకులకు కొత్త తలనొప్పులు తప్పవు.
అసలే కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ చేరికలతో గ్రూపులు ఎక్కువైపోయి మితిమీరిన తలనొప్పులు తెస్తే, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుట్టి ఉండడం ఖాయమని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు!
కేటీఆర్ పర్యటన వేళ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కానరాలేదు..
అసలే ఓ వైపు బీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి మారుతున్న వేళ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు కేటీఆర్ పర్యటనలో కనిపించకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. కార్పొరేటర్ తో పాటు ఆయన కూడా పార్టీ మారుతున్నారా? అసలు కార్పోరేటర్లు పార్టీ మారట వెనక ఆయన హస్తం ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అయితే అలాంటిదేమీ లేదని కేటీఆర్ పర్యటనకు ముందే తాతా మధు అమెరికా ప్రయాణం పెట్టుకున్నారని, కేటీఆర్ సభకు తాను అందుబాటులో ఉండబోనని పార్టీ వర్గాలకు ముందే చెప్పినట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడి స్థానంలో ఉండి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సభకి, ఉండకపోవటం ఏమిటి అని, ఆయనకు పార్టీ క్యాడర్ పై పట్టు లేదని ఆయన తీరు వల్లే ఆ పార్టీ కార్పొరేటర్లు అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.