18-09-2025 12:11:54 AM
పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం.
ఇప్పటికే విడుదవలైన గ్లింప్స్, పాటలతోనే సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. అభిమానులైతే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు భారీగా పెంచారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేశారు. ఈ మూవీ బెనిఫిట్ షోను 24న అర్ధరాత్రి ఒంటిగంటకు రూ.1000 టికెట్ రేట్‌తో అనుమతి ఇచ్చారు. మొదటి రోజు ఐదు షోలకు అనుమతి కూడా లభించింది. సినిమా విడుదలయ్యే తేదీ నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ టికెట్ రేట్లు అమల్లో ఉంటాయని జీవో జారీ చేశారు. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరను రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 అదనం గా పెంచుకునే వెసులుబాటును కల్పించారు.