18-09-2025 12:13:36 AM
తిరువీర్, టీనా శ్రావ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 7 పీఎం ప్రొడక్ష్సన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అస్మితారెడ్డి బాసిని నిర్మిస్తున్నారు. నవంబర్ 7న సినిమా విడుదల కానున్న ఈ మూవీ టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన కార్యక్రమంలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “ఈ ఈవెంట్‌కు పిలచినప్పుడే ఇదొక స్పెషల్ ఫిల్మ్ అనిపించింది.
ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడానికి ధైర్యం, పాషన్ ఉండాలి. బ్యాక్‌డ్రాప్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది” అన్నారు. హీరో తిరువీర్ మాట్లాడుతూ “మార్కెట్ లెక్కల గురించి ఆలోచించకుండా సందీప్, రంజిత్ ధైర్యంగా ముందుకొచ్చారు. కొత్త ప్రొడ్యూసర్, డైరెక్టర్ రిస్క్ చేస్తున్నప్పుడు మంచి కథను ప్రోత్సహించడానికి నేనేం చేయగలను ఆలోచించాను.. రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాలో భాగమయ్యాను. ఇది నా నమ్మకాన్ని నిలబెడితే భవిష్యత్తులో ఇలాంటి కొన్ని సినిమాలు చేస్తాను” అని చెప్పారు. ‘
టీజర్ శాంపిల్ మాత్రమే. రెండు గంటలు ప్రతి సీన్, డైలాగ్ బాంబ్‌లా పేలిపోతాయ’ని హీరోయిన్ టీనా శ్రావ్య తెలిపింది. డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ “మసూద’ హిట్ట్ అయిన తర్వాత తీరువీర్‌కు చాలా మంది కథలు చెప్పారు. కానీ వారందరిని కాదని డెబ్యూ డైరెక్టర్ అయినా నన్ను నమ్మాడు. అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను” అని తెలిపారు. నిర్మాత సందీప్ మాట్లాడుతూ “అనుకున్న బడ్జెట్ కంటే ఐదింతలు పెరిగింది. కథపై నమ్మకంతో ఎక్కడా రాజీపడకుండా సినిమా చేశాం” అని తెలిపారు. ‘ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్విస్తుంద’ని మరో నిర్మాత అశ్వితరెడ్డి చెప్పారు. నటులు రోహన్, నరేంద్ర రవి, ఎడిటర్ నరేశ్, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.