calender_icon.png 18 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు భారత్ కాన్సులేట్‌ను సీజ్ చేస్తాం

18-09-2025 12:56:17 AM

  1. ఖలిస్థానీల హెచ్చరిక
  2. కొత్త హై కమిషనర్‌ను టార్గెట్ చేస్తూ పోస్టర్
  3. నిజ్జర్ హత్యపై ట్రూడో ప్రకటనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బెదిరింపులు
  4. భారత్--కెనడా బంధం కుదుటపడుతున్న వేళ.. 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదులు వాంకోవర్‌లోని భారత్ కాన్సులేట్‌ను సీజ్ చేస్తామంటూ హెచ్చరించారు. ఖలిస్థానీ సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే) సంస్థ ఈ బెదిరింపులకు పాల్పడింది. గురువారం భారత్ కాన్సులేట్ ను స్వాధీనం చేసుకుంటామని, ఆ సమయంలో ఇక్కడికి ఎవరూ రావొద్దంటూ హెచ్చరించింది. భారత్--కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు మళ్లీ గాడిన పడుతున్న సమయంలో ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థ మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది.

అంతేకాకుండా, కెనడాకు భారత కొత్త హై కమిషనర్‌గా నియమితులైన దినేష్ పట్నాయక్ ముఖంపై టార్గెట్ గుర్తు ఉన్న పోస్టర్‌ని విడుదల చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్రపై దర్యాప్తు జరుగుతోందని 2023 సెప్టెంబర్ 18న అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటులో ప్రకటించారని, ఆ ఘటనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నిరసన చేపడుతున్నట్లు తెలిపింది.

భారత కాన్సులేట్లు ఖలిస్థాన్ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని గూఢచర్య నెట్‌వర్క్ నడుపుతున్నాయని ఎస్‌ఎఫ్‌జే ఆరోపించింది. కెనడా గడ్డపై భారత్ చేస్తున్న నిఘా, బెదిరింపుల నేపథ్యంలో కాన్సులేట్‌ను ముట్టడి చేస్తున్నట్లు తెలిపింది. కాగా ఈ బెదిరింపులపై వాంకోవర్‌లోని భారత్ కాన్సులేట్ ఇప్పటి వరకు స్పందించలేదు.

అయితే, ఇదే కెనడా ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన ఒక నివేదికలో తమ దేశంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ వంటి ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు చురుకుగా ఉన్నాయని, వాటికి స్థానికంగా ఆర్థిక మద్దతు కూడా లభిస్తోందని అంగీకరించడం గమనార్హం. భారత్‌లోని పంజాబ్‌లో స్వతంత్ర దేశస్థాపన కోసం హింస్మాత్మక మార్గాలకు మద్దతు ఇచ్చే ఖలిస్థానీ ఉగ్రమూకలు కెనడా సహా అనేక దేశాల్లో నిధులు సేకరిస్తున్నట్లు నివేదికలో వెల్లడించింది.

2023లో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించగా, భారత్ ఆ ఆరోపణలను ‘అసంబద్ధమైనవి, దురుద్దేశపూరితమైనవి’గా కొట్టిపారేసింది.

ఇటీవల జూన్లో జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ భేటీ అయిన తర్వాత ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మళ్లీ మెరుగుపడుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త హై కమిషనర్ల నియామకం జరగ్గా, ఇప్పుడు ఖలిస్తానీ సంస్థ నుంచి ఈ తాజా బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.