28-10-2025 12:00:00 AM
తిరిగి స్వస్థలాలకు 54 మంది భారతీయులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: అక్రమ ‘డంకీ’ మార్గంలో అమెరికాకు వెళ్లిన 54 మంది భారతీయులను ఆ దేశం తిరిగి వెనక్కి తిప్పి పంపింది. అలా వచ్చిన వారందరూ హర్యానాకు చెందిన వారే కావడం గమనార్హం. వలసదారులంతా తాజాగా ‘ఓఏఈ 4767’ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటున్నా, అక్రమ మార్గంలో అక్కడికి వెళ్లేవారి ప్రయత్నాలు మాత్రం ఆగడంలేదు.
అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్లవద్దని, అలా చేస్తే కొత్త సమస్యలు కొనితెచ్చుకోవద్దని భారత ప్రభుత్వం హెచ్చరించింది. కాగా, విదేశాలకు అక్రమంగా వెళ్తేందుకు అనుసరించే మార్గాన్నే ‘డంకి’ అంటారు. ఈ పదం పంజాబీ వాడక భాష నుంచి వచ్చింది. అక్రమ మార్గంలో అమెరికా వెళ్లేందుకు హర్యానా, పంజాబ్ నుంచి ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. అక్కడి నుంచే ఎక్కువ డంకీ ఘటనలు వెలుగుచూస్తాయి.