03-11-2025 06:27:45 PM
రాజస్థాన్: రాజస్థాన్ లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌లోని హర్మాడ పోలీసు స్టేషన్ పరిధిలోని లోహామండీలో సోమవారం మధ్యాహ్నం ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... లోహమండి ప్రాంతంలో ఖాళీగా ఉన్న డంపింగ్ టిప్పర్ రోడ్ నంబర్ 14 నుండి లోహా మండి పెట్రోల్ పంప్ వైపు వెళ్తుంది. దాదాపు 300 మీటర్ల విస్తీర్ణంలో వేగంగా వస్తున్న డంపర్ ట్రక్ అదుపుతప్పి ఒకదాని తర్వాత ఒక వాహనాలను ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, మరికొంత మంది తీవ్రంగా గాయాలయ్యాయి.
గాయపడిన వారిని అంబులెన్స్‌లలో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. టిప్పర్ సృష్టించిన బీభత్సానికి సుమారు 10కిపైగ వాహనాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం. పోలీసు బృందాలు సంఘటనాస్థలానికి చేరుకుని, ట్రాఫిక్‌ను మళ్లించి, దెబ్బతిన్న వాహనాలను హైవే నుండి తొలగించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తలించారు. విషయం తెలుసుకున్న జైపూర్ జిల్లా కలెక్టర్ జితేంద్ర సోని టిప్పర్ ప్రమాదంపై అధికారులను ఆరా తీశారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఎస్ఎంఎస్ హాస్పిటల్ ట్రామా సెంటర్‌కు తరలించామని చెప్పారు. రాజస్థాన్‌లో వరుసగా రెండు రోజుల్లో ఇది రెండో అతిపెద్ద రోడ్డు ప్రమాదం. ఆదివారం సాయంత్రం ఫలోడి ప్రాంతంలో ఒక టెంపో ట్రావెలర్ నిలబడి ఉన్న ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టడంతో 10 మంది మహిళలు, నలుగురు పిల్లలు సహా కనీసం 15 మంది మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డిన విషయం తెలిసిందే.