calender_icon.png 4 November, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేప పిల్లలను లక్ష్యం మేర పెంచేందుకు సకాలంలో చెరువుల్లో వదలాలి

03-11-2025 06:55:48 PM

గద్వాల: జిల్లాలో చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు, లక్ష్యం మేర చెరువుల్లో చేప పిల్లలను సకాలంలో వదులుతున్నట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, ఇతర జలాశయాల్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమంపై సోమవారం హైదరాబాద్ నుంచి మత్స్యశాఖ ప్రత్యేక కార్యదర్శి సవ్యసాచి ఘోష్, డైరెక్టర్ నిఖిలతో కలిసి రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్ని జిల్లాల కలెక్టర్లు, మత్స్యశాఖ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సీజన్లో 7 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా వీటి పెంపకానికి రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు.

ఇప్పటికే చేప పిల్లల కొనుగోలుకు టెండర్ ప్రక్రియ పూర్తయిన కొన్ని జిల్లాల్లో చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం ఈనెల 20 లోగా పూర్తయ్యేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మాంసాహారంలో చేపలు తినే వారి సంఖ్య పెరగాలంటే ప్రజలకు వీటి ప్రయోజనం గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జూరాల వంటి జలాశయాల వద్ద చేపల స్టాల్స్, ఐస్ ప్లాంట్స్ ఏర్పాటుచేసి ఆక్వా కల్చర్ అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. ఆయా జిల్లాల్లోని స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత మత్స్యకార సంఘాల అధ్యక్షులను చేప పిల్లలను నీటిలో వదిలే కార్యక్రమంలో పాలుపంచుకునేలా అధికారులు నిబంధనల ప్రకారం పనిచేయాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 30% చేప పిల్లలను చెరువుల్లో వదిలి రాష్ట్రంలోనే ముందున్నామని తెలిపారు. జిల్లాలో సుమారు రూ.2.50 కోట్ల నిధులతో 1.90 కోట్ల చేప పిల్లలను ఆయా చెరువుల్లో వదులుతున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 375 చెరువులు ఉండగా ప్రస్తుతం 236 చెరువుల్లో చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. మిగతా చెరువుల్లోనూ నీటి లభ్యతపై ఇరిగేషన్ అధికారులతో స్పష్టత తీసుకొని, వాటిలోనూ చేప పిల్లల పెంపకానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు టీ మత్స్య మొబైల్ యాప్ గురించి ఇప్పటికే జిల్లాలో అవగాహన కల్పించామని, లబ్ధిదారులందరూ తమ వివరాలను ఇందులో నమోదు చేసుకునేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో రాజోలి, గట్టు, రేవులపల్లిలో చేపల మార్కెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జిల్లా మత్స్యశాఖ అధికారిని షకీలా భాను, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.