calender_icon.png 11 December, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ఘర్షణకు ఒకరు బలి

11-12-2025 12:24:59 AM

  1.  సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య గొడవ
  2. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి 
  3. బీఆర్‌ఎస్ కార్యకర్త మల్లయ్య మృతి

నూతనకల్, డిసెంబర్ 10: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపించింది. మంగళవారం రాత్రి గ్రామంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తుండగా ఇరువర్గాలు ఎదురుపడ్డాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది.

క్షణికావేశంలో ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బీఆర్ ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మృతి చెందారు. ఈ హత్యతో లింగంపల్లి గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. 

8 మంది నిందితుల అరెస్ట్

ఉప్పుల మల్లయ్య హత్య కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఉప్పుల సతీష్, కొరివి గంగయ్య, వీరబోయిన సతీష్, ఉప్పుల గంగయ్య, ఉప్పుల ఎలమంచి, వీరబోయిన లింగయ్య, కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్య ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి దాడికి ఉపయోగించిన కర్రలు, రాళ్లు, 4 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. 

కాంగ్రెస్‌వి హత్యా రాజకీయాలు

 తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తున్నదని, వాటిని సహించబోమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగంపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన జగదీష్‌రెడ్డి, గాదరి కిషోర్‌లతో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు.

  ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోలేక, భౌతిక దాడులకు దిగడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమనీ కేటీఆర్ అన్నారు. అధికార మదంతో కాంగ్రెస్ గూండాలు సాగిస్తున్న అరాచకాలను బీఆర్‌ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదన్నారు. కార్యకర్తకు, నాయకుడికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడవద్దని, మరణించిన కార్యకర్త కుటుంబానికి, గాయపడిన వారికి పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

ఓటమి భయంతోనే కాంగ్రెస్ అరాచకాలు 

 గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతోనే అరాచకాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి అన్నారు. ఉప్పల మల్లయ్య మృతదేహానికి జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో బుధవారం పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ మరింత బలపడుతుందన్న భయంతోనే కాంగ్రెస్ రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నదన్నారు.

కాంగ్రెస్ పాలనలో హత్యా రాజకీయాలు మొదలయ్యాయని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ మంత్రుల అండదండలతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పుతుందన్నారు. ఈ విషయంపై డిజిపి ప్రత్యేక దృష్టి సారిస్తే మంచిధని సూచించారు. 

 మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి