15-12-2025 02:16:53 AM
నిర్మల్ జిల్లాలో ఇద్దరి విజయం
నిర్మల్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆదివారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. నర్సాపూర్ మండలంలోని గొల్లమడ గ్రా మంలో చిన్నమనేని వసంత, దీక్షిత్ పటేల్ మధ్య నువ్వా నేనా అనే రీతిలో కౌంటింగ్ జరిగింది. మొదటగా వసంతకు నాలుగు ఓట్లు ఆధిక్యత వచ్చినట్టు అధికారులు తెలుపగా, దీక్షిత్ పటేల్ మూడుసార్లు రికౌంటి గ్‌కు పట్టుపట్టడంతో మూడుసార్లు ఓట్లను లెక్కించారు.
రెండోసారి కౌంటింగ్‌లో మూడు ఓట్లు, మూడోసారి కౌంటింగ్‌లో రెండు ఓట్లు, నాలుగోసారి కౌంటింగ్‌లో ఒక ఓటు, రికౌంటింగ్‌లో వసంతకు ఆధిక్యత రావడంతో అధికారులు వసంతను విజేతగా ప్రకటించారు. ఈ కౌంటింగ్ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. కుంటాల మండలంలోని అంబకంటి తండా గ్రామంలో దగ్గర బంధువులైన జ్యోతిబాయ్ మీరాబాయి పోటీ పడగా జ్యోతిబాయ్ మూడోట్లతో విజయం సాధించగా చెల్లని ఓట్లు మూడుగా ఉండటంతో అదృష్టం తారు మారయింది.
సోను మండలంలోని సిద్ధిలకుంట గ్రామంలో బావ, మరదలు పోటీ పడగా మరదలుపై బావ 192 ఓట్లతో విజయం సాధించారు. ముజ్గి గ్రామంలో అత్యధికంగా 9 మంది పోటీ చేయగా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రచారం చేయని రాజేశ్వర్‌ను అతని సోదరుడు మల్లేష్ యాదవ్ గెలిపించుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్‌తో విజయం
లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామంలో ముత్యాల శ్రీ వేద, హర్షస్ స్వాతికి 188 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. ఆ గ్రామంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోగా ఆ ఓటు ముత్యాల శ్రీ వేదకు పడటంతో ఆమె విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు ఐదేళ్ల సర్పంచ్ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.