calender_icon.png 15 December, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలసరిలో 2వ స్థానం

15-12-2025 01:33:35 AM

దేశంలోనే ఢిల్లీ తర్వాత తెలంగాణే..

  1. పర్ క్యాప్టా ఆదాయం రూ.3.87 లక్షలు 
  2. స్వరాష్ట్రం ఏర్పడిన నాడు ఆదాయం రూ.1.24 లక్షలు
  3. పదేళ్లలో గణనీయమైన ఆర్థికాభివృద్ధి 
  4. స్టార్టప్స్, ఐటీ, ఫార్మా రంగాలు రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్లు

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణ ఏర్పడి కొద్దిసంవత్సరాలే అయినప్పటికీ తలసరి ఆదాయంలో మాత్రం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడుతున్నది. యేటికేడు తలసరి ఆదాయంలోనూ దూసుకెళ్తున్నది. తాజాగా రాష్ట్రం రూ.3,87,623 తలసరి ఆదా యం నమోదు చేసి టాప్-5 రాష్ట్రా ల్లో ఒకటిగా నిలిచింది. మొదటి స్థానంలో ఢిల్లీ ఉండగా, రెండోస్థానంలో తెలంగాణ చేరడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు, హర్యానా నిలిచాయి.

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్రం తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధిని సాధిస్తూ వస్తున్నది. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు కాగా, ఇప్పుడా తలసరి ఆదాయం రెండింతలకు పైగా  చేరుకోవడం గమనార్హం. ఈ ఆర్థికాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వాలు అవలంబించిన విధానాలే కారణం. తలసరి ఆదాయం పెరుగుదల అనే ది ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలనూ ప్రతిబింబిస్తుంది.

రాజధాని హైదరాబాద్ కీలకం..

2014లో ఏర్పడిన తెలంగాణ.. అతి తక్కువ కాలంలోనే దేశ ఆర్థిక ముఖ చిత్రంలో కీలక స్థానాన్ని సంపాదించింది. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ, ఫార్మా, స్టార్టప్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరించడంతోనే రాష్ట్ర ఆదా యం గణనీయంగా పెరిగింది. పెద్ద ఎత్తున ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగడం, రహదారులు, మెట్రో, ఐటీ పార్కులు, ఇండస్ట్రియల్ కారిడార్లు రావడంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివచ్చాయి.

ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో భారీ ఉద్యో గాల కల్పన, ఫార్మా, లైఫ్ సెన్సైస్‌లో అంతర్జాతీయ పెట్టుబడులు, స్టార్టప్‌లకు అనుకూలమైన విధానాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై నిరంతర పెట్టుబడులు, పట్టణీకరణతో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధి వంటి అంశాలు రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడానికి కారణమయ్యాయి.

టాప్-5లో మూడు దక్షిణాది రాష్ట్రాలే..

ఆర్థిక గణాంకాల ప్రకారం తలసరి ఆదాయంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, వరుసగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, హర్యానా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టాప్-౫ రాష్ట్రాల్లో మూడు దక్షిణాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులు, సేవలు, పరిశ్రమల ప్రభావం ఆధారంగా తలసరి ఆదాయ నిర్ధారణ ఉంటుంది. ఢిల్లీ తలసరి ఆదాయం గరిష్ఠంగా రూ.4,93,024 ఉంది.

సేవా రంగ సేవల విస్తరణ వల్లే దేశ రాజధాని తలసరి ఆదాయం పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్థిక, విద్య, ఆరోగ్య విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అధిక ఆదాయ వేతనాలు కూడా ఢిల్లీ వృద్ధికి కారణాలు. గ్లోబల్ కంపెనీలు, రీసెర్చ్ సెంటర్స్, స్టార్టప్స్ ఆదాయం పెరగడంతో కర్ణాటక రూ. 3,80,906 తలసరి ఆదాయం సాధించి దే శంలోనే మూడో స్థానంలో నిలిచింది.

ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ రంగాల వృద్ధి, పట్టణ--గ్రామీణ ఆర్థిక సమతుల్యాన్ని సాధించి తమిళనాడు రూ.3,61,619 తలసరి ఆదాయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. వ్యవసాయం, ఆటోమొబైల్స్ రంగాల అభివృద్ధి కారణంగా హర్యానా రూ.3.53,182 తలసరి ఆదాయం సాధించి ఐదో స్థానంలో నిలిచింది.