15-12-2025 01:57:25 AM
ప్రజారోగ్యాన్ని హరిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్లు
ఇండస్ట్రియల్ కారిడార్ ఇప్పుడు పొల్యూషన్‌కు కేరాఫ్
థర్మల్ పవర్ ప్లాంట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలో అపరమితంగా బొగ్గు వినియోగం
హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): రామగుండం- జైపూర్ ఇండస్ట్రి యల్ కారిడార్ ప్రాంతం ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతంగా మారింది. వాయు, జల కాలుష్యంగా పతాక స్థాయికి చేరడంతో ప్రజారోగ్య పరిరక్షణ ప్రమాదంలో పడింది. ఈ ప్రాం తంలో సుమారు 15 లక్షల జనాభా ఉండ గా, సుమారు 6 వేల మంది క్యాన్సర్ బారిన పడ్డారు. వేలాది మందికి ప్రీ క్యాన్సర్ లక్షణాలు బయటపడ్డాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిన బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, సిమెం ట్ ఫ్యాక్టరీలకు అనుమతులు ఇస్తుండటం తో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ ప్రాంతంలోని 5,400 మెగా వాట్ల థర్మల్ పవర్ ప్లాంట్లలో యాజమాన్యాలు ఏటా దాదాపు 50 లక్షల టన్నుల బొగ్గు మండిస్తున్నాయి. అలాగే సిమెంట్ తయారీ కోసం ఆ కంపెనీ 95 లక్షల టన్నుల బొగ్గును మండిస్తున్నది. ఇవి కాక త్వరలో రామగుండం ప్రాంతంలో మూడు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లు ఏర్పా టు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి.
అదేజరిగితే ఈ ప్రాంతంలో వాయు, జల కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి పెరుగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నా రు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాల ప్రకారం 5 మైక్రోగ్రా మ్ పర్ క్యూబిక్ మీటర్‌లో పీఎం 2.5 కాలుష్య రేణువులు ఉండటం ప్రమాదక రం కాదు. కానీ, నవంబర్ నెలలో రామగుండం పరిసర ప్రాంతాల్లో ఆ సూచిక 175- 250 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ నమోదైంది. అంటే సురక్షిత పరిమితికి కంటే.. అది 35-50 రెట్లు ఎక్కువ.
బూడిదలో ఖనిజ అవశేషాలు
బొగ్గు మండిన తర్వాత మిగిలిన బూడిదలో దాదాపు 40 శాతం అల్యూమినియం అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఈ బూడిద వ్యవసాయ భూములు, అడవుల్లో పడుతుండటంతో సారవంతమైన భూములు నిస్సారమవుతున్నాయి. అటవీప్రాంతం పచ్చదనాన్ని కోల్పోతున్నది. అలా రామగుండం, కమాన్‌పూర్, జైపూ ర్ మండలాల్లో 80,000 ఎకరాలకు పైగా నిస్సారమైందని ఓ అంచనా.
పంట దిగుబడులు తగ్గిపోవడంతో రైతులు, కూలీల జీవనాధారం దెబ్బతింటోంది. భూగర్భజలాలు కూడా కలుషితం అవతుండటంతో తాగునీరు కూడా విషమ యమవుతున్నది. ఒకప్పుడు స్నానానికి ఉపయోగపడే ‘సీ’ కేటగిరీలో ఉన్న గోదావరి జలాలు ఇప్పుడు ‘హెచ్’ కేటగిరీకి పడిపోయింది. ఎన్‌టీపీసీ, జైపూర్ థర్మ ల్ ప్లాంట్, ఆర్‌ఎఫ్‌సీఎల్, బసంత్‌నగర్ సి మెంట్ ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్య ర్థాలే కారణమని స్థానికులు చెబుతున్నారు.
అనారోగ్య సమస్యలు తీవ్రతరం
కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలో ఆనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. ప్రజారోగ్యం ప్రమాదపు అంచు నుంది. ఇటీవల రోహిణి అనే సంస్థ నిర్వహించిన ఓ వైద్య శిబిరంలో వైద్యులు 5,000 మందిని పరీక్షించగా, వీరిలో 183 మందికి ప్రీ లక్షణాలు ఉన్నాయని తేలింది. అలాగే 20 మందికి క్యాన్సర్ నిర్ధారణ అయింది. అలాగే ఎంతోమంది గుండె జబ్బులు, మూ్ర తపిండ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది.
ఇక్కడ కొన్ని అకస్మాత్తు మరణాల సంఖ్య కూడా పెరుగు తండటం గమనార్హం. పరిస్థితి చేయిజారకముందే గోదావరిఖని, మంచిర్యాల, నస్పూ ర్ ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, 100 గ్రామ పంచాయతీల సర్పంచులు, 170 మున్సిపల్ వార్డు సభ్యులు వెంటనే స్పందించాలని, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతున్నది.
కాలుష్యానికి కారణాలు
విద్యుత్ ఉత్పత్తి కోసం యజామాన్యాలు ఏటా 50 లక్షల టన్నుల బొగ్గు, సిమెంట్ త యారీ కోసం 95 లక్షల టన్నుల బొగ్గును మండిస్తున్నది. పీఎం 2.5 స్థాయి డబ్ల్యూహెచ్‌వో పరిమితికి 35 రెట్లు ఎక్కువ న మోదవుతుండటం ఆందోళన కలిగించే విష యం. కాలుష్యంతో ఈ ప్రాంతంలో 80వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు నిస్సారమవుతున్నాయి. అటవీప్రాంతం కాలుష్యమై పచ్చదనాన్ని కోల్పోతున్నది. గోదావరి జలాల నాణ్యత ‘సీ’ కేటగిరీ నుంచి ‘హెచ్’ కేటగిరీకి పడిపోయింది. కాలుష్య ప్రభావంతో 15 లక్షల జనాభాలో సుమారు 6,000 మంది క్యాన్సర్ బారినపడ్డారు. మరకొంతమందిలో ఇప్పుడిప్పుడే క్యాన్సర్ లక్షణాలు బయటపడుతున్నాయి.
పరిస్థితులు చేయిదాటుతాయి..
రామగుండం ప్రాంతంలో వాయి కాలుష్యం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ ప్రాంతంలోని కార్మిక వర్గం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరణాల రేటు సాధారణ ఉద్యోగులతో పోలిస్తే కార్మికుల్లో 10 రెట్లు ఎక్కువగా ఉంది. పవర్ ప్లాంట్ల విస్తరణ ఇంకా పెరిగితే పరిస్థితులు చేయిదాటతాయి.
సునీత నారాయణ్, సీఎస్‌సీ డైరెక్టర్
కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలి..
మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లి, మంథని, బెల్లంపల్లి, జైపూర్, కామన్‌పూర్, జులపల్లి ప్రాంతాల్లో కలిపి 15 లక్షల జనాభాలో ఇప్పటికే 6,000 మందికి క్యాన్సర్ ఉంది. రాష్ట్రప్రభుత్వం కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి. మా ప్రాంతంలో బొగ్గు ప్లాంట్ల విస్తరణ ఇలాగే కొనసాగితే ఈ తరం మొత్తం అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. భవిష్యత్ తరాలపెనా ఆ ప్రభావం పడనుంది. మున్ముందు పర్యావరణ విపత్తుగా పరిణమిస్తుంది. రాష్ట్రప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. రామగుండం-జైపూర్ ప్రాంతం ఇప్పుడు అత్యంత ప్రమాదకరస్థాయిలో ఉంది. బొగ్గు ప్లాంట్ల విస్తరణ ఆపకపోతే, ఓపెన్ కాస్ట్ మైనింగ్‌ను నియంత్రించకపోతే మా మనుగడ కష్టతరమవుతుంది.
ఉమామహేశ్వర్, పర్యావరణ ఉద్యమకారుడు