calender_icon.png 15 December, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యో.. గోపాల

15-12-2025 01:24:03 AM

8 నెలలుగా గోపాల మిత్రలకు అందని వేతనాలు

  1. ఆర్థిక ఇబ్బందులతో భారంగా కుటుంబ పోషణ 
  2. రాష్ట్రవ్యాప్తంగా 1500 మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగులు 
  3. 25ఏళ్లుగా పనిచేస్తున్న మారని బతుకుచిత్రం
  4. పశువులు, జీవాలకు అత్యవసర సమయాల్లో చికిత్స

* ఒక శాఖది ఎనిమిది నెలల నిర్లక్ష్యం.. మరో శాఖది చెప్పలేని పరిస్థితి.. ఫలితంగా 1500మంది గోపాల మిత్రల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. అసలే చాలీచాలని వేతనం.. ఆపై ఎనిమిది మాసాలుగా అరకొర వేతనం కూడా అందకుంటే మా జీవితాల పరిస్థితి ఏంటని? గోపాల మిత్రలు ఘోషిస్తున్నారు. గోపాల మిత్రల సేవలు ప్రతి ఏటా ఏప్రిల్‌లోనే  రెన్యువల్  చేయాల్సి ఉంటుంది. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌లో కావాల్సిన రెన్యువల్ ప్రక్రియకు గత నవంబర్‌లోనే పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయం అనుమతి లభించిన ఫైలు ఆర్థిక శాఖ కార్యాలయం మూలు గుతోందని గోపాల మిత్రలు వాపోతున్నారు.

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : పశుసంవర్థక శాఖ పరిధిలో కాంట్రాక్టు పద్ధతిన దాదాపు 1500 మంది వరకు గోపాల మిత్రలుగా పని చేస్తున్నారు.  25 ఏళ్లుగా పని చేస్తున్న వీరికి ప్రభుత్వం నెలకు రూ. 11,050 చొప్పున  గౌరవ వేతనం ఇస్తోంది. ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో రూ. 13 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ప్రతిసారి వేతన చెల్లింపుల్లో ఆలస్యమవుతున్నటప్పటికీ.. ఈ సారి ఏకంగా ఏప్రిల్ నుంచి పెండింగ్‌లో ఉండటం గమనార్హం.

ఆ రెండు శాఖల వల్లే రెన్యువల్‌కు ఆలస్యం?

గోపాల మిత్రలకు వేతనాలు మరింత ఆలస్యం కావడానికి పశుసంవర్థ్ధక శాఖ, ఆర్థిక శాఖల ఉదాసీనతే కారణమనే విమర్శలు ఉన్నాయి. గోపాల మిత్రల సేవలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలోనే  రెన్యువల్  చేయాల్సి ఉంటుంది. 2025 26 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెలలో కావాల్సిన రెన్యువల్  ప్రక్రియకు గత నంబవర్‌లోనే అనుమతి లభించిందని చెబుతున్నారు. అయితే, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి వేతనాల ఫైలు వెళ్లిందని, ఆఫైలు ఆర్థిక శాఖకు వెళ్లి అక్కడ అనుమతి పొంది మళ్లీ వెన క్కి రావాల్సి ఉంది. ఆర్థిక శాఖ నుంచి ఫైలు వెనక్కి రావడం, జీతాల బిల్లులు మం జూరు కావడానికి ఎన్ని నెలలు పడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని గోపా ల మిత్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పశువులు, జీవాలకు అత్యవసర సమయాల్లో చికిత్స

గ్రామాల్లో పశువులకు టీకాలు వేయడం మొదలు కృత్రిమ గర్భధారణ, ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో వెటర్నరీ అసిస్టెంట్లకు సాయం చేస్తుంటారు. అంతే కాకుండా గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ, ఆంథ్రాక్స్, బ్రూసెలాసిస్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు టీకాలు వేయడం, పశువైద్య శిబిరాలు ఏర్పాటు, మండల పశువైద్యాధికారికి చేదోడు వాదోడుగా ఉండి విధులు నిర్వహిస్తున్నారు. పశువులు, జీవాలకు అత్యవసర సమయాల్లో చికిత్సలకు వెళ్లి.. వాటికి వైద్యం అందిస్తారు.

అయితే 2000 వేల సంవత్సరం నుంచి దాదాపు ఏడేళ్ల పాటు ఉచితంగా సేవలు అందించారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలకు తొలిసారిగా రూ. 1200 గౌరవ వేతనాన్ని ఇచ్చారు. ఆ తర్వాత క్రమ క్రమంగా పెంచుతూ ఇప్పుడు రూ. 11 వేల వరకు  వేతనం ఇస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా వేతనాలు రావడం లేదని, తాము చేస్తున్న  పనికి తగినట్లుగా వేతనాలు ఇవ్వడం లేదని గోపాల మిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకిచ్చే తక్కువ వేతనాలు కూడా నెలలు తరబడి పెండింగ్‌లో పెట్టడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. 

వేతనాలు విడుదల చేయాలి

 25 ఏళ్లుగా పశు సంరక్షణకు పని చేస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కూడా లేదు. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం వెళ్లి రోడ్డు ప్రమాదాలకు గురైన ఘటనలు అనేకం ఉన్నాయి. తమ ఇబ్బందులను ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుం డా పోయింది. పశువులతో పాటు తమను కూడా ప్రభుత్వం కాపాడుకోవాలి. అప్పుడే మా కష్టాలు తీరుతాయి. ఇప్పుడు ఎనిమిది నెలలుగా వేతనాలు రాకపో వడంతో ఇబ్బందులు పడుతున్నాం. తమ వేతనాలు విడుదల చేసి ప్రభుత్వం ఆదుకోవాలి. 

సీహెచ్  శ్రీనివాస్, గోపాలమిత్రల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు