15-12-2025 01:48:04 AM
రెండో విడత పల్లెపోరులోనూ హస్తానిదే హవా
హైదరాబాద్, డిసెంబర్ 1౪ (విజయక్రాంతి): మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పైచేయి సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీ.. రెండో విడతలోనూ సత్తా చాటింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకుని రాష్ట్రంలో తిరుగులేదని చాటి చెప్పింది. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొదటి విడత కంటే ఒక శాతానికి పైగా ఎక్కువగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడతలో 84.28 శాతం నమోదవగా, రెండో విడతలో 85.86 శాతం ఓట్లు నమోదయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
అత్యధికం గా యాదాద్రి జిల్లాలో 91.72 శాతం, రెండో స్థానంలో 91.21 శాతంతో ఖమ్మం జిల్లా నిలిచింది. ఇక అత్యల్పంగా నిజమాబాద్‌లో 76.71 శాతం ఓట్లు పోలైనట్లు తెలిపారు. రెండో విడతలో 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడతలోనూ యాదాద్రి మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
27,628 వార్డులకు గాను 65,455 మంది బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నాం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. రెండోవిడత పంచాయతీ పోరులోనూ కాంగ్రెస్ పార్టీనే సత్తా చాటింది. మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకుంది. రెండో విడతలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకు గాను 415 ఏకగ్రీవం కావడంతో మిగతా 3,911 సర్పించ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
వార్డుల్లో 38,322కి గాను 8,304 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 29,917 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో మోజా ర్టీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్.. రెండో విడతలోనూ అదే ఒరవడిని కొనసాగించింది. బీఆర్‌ఎస్ పార్టీ రెండో దఫాలోనూ రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నది. మూడో స్థానంలో స్వతంత్రులు గెలుపొందగా, బీజేపీ మరోసారి నాలుగో స్థానానికే పరిమితమైంది.
అయితే చాలా గ్రామాల్లో అధికార కాంగ్రెస్ ఒకటి, రెండు ఓట్లతో పాటు పదుల సంఖ్య మెజార్టీతో గెలుపొందిన గ్రామాలు చాలానే ఉన్నాయి. మరికొన్ని గ్రామాల్లో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో డ్రా లో గెలుపొందిన వారిని సర్పంచ్‌గా ఎన్నికల రిటర్నింగ్ అధికారకులు ప్రకటించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు పంచాయతీల్లో గట్టి పోటీ ఇస్తామనుకున్నప్పటికి సగం స్థానాలకే పరిమిత మైంది. బీజేపీ మాత్రం తాము ఊహించినదానికంటే ఎక్కువగానే పంచాయతీల ఫలితాలు వచ్చాయని చెపుతున్నారు.
జిల్లాల వారిగా పోలింగ్ శాతం..
నిజామాబాద్ - 76.71, జగిత్యాల - 78.34, భద్రాద్రి కొత్తగూడెం- 82.65, నిర్మల్ - 82.67, వికారాబాద్ - 82.72, ములుగు- 82.93, నాగర్‌కర్నూల్ - 83. 98, పెద్దపల్లి - 84.15, నారాయణపేట్ - 84.38, రాజన్నసిరిసిల్ల - 84.41, మంచిర్యాల్ - 84.59, మహబూబాబాద్ - 85. 05, జయశంకర్ భూపాలపల్లి - 85.25, రంగారెడ్డి- 85.30, కామారెడ్డి- 86.08, కరీంనగర్ - 86.58, మహబూబ్‌నగర్ - 86.62, ఆసిఫాబాద్ - 86.63, ఆదిలాబాద్ - 86.68, సంగారెడ్డి - 86.96, వనపర్తి - 87.05, జోగులాంబ గద్వాల - 87.08, హన్మకొండ - 87.34, వరంగల్ - 88.11, సిద్దిపేట - 88.36, జనగాం - 88.52, నల్లగొండ - 88.74, మెదక్ - 88.80, సూర్యాపేట - 89.55, ఖమ్మం - 91.21, యాదాద్రి భువనగిరి - 91.72 శాతం ఓటింగ్ నమోదంది.

ప్రజల విశ్వాసానికి నిదర్శనం
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మెజార్టీగా విజయం సాధించడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలవడం కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రజల ఆశయాలకు అద్దం పట్టే ఈ ఫలితాలు, ప్రభుత్వంపై వారి అపార నమ్మకాన్ని తిరిగి చాటాయన్నారు.
ఈ ఎన్నికలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను సమన్వయం చేస్తూ గ్రామ స్థాయి వరకు ప్రచార వ్యూహాలు రూపొందించి అమలు చేసిన విధానమే ఈ విజయానికి ప్రధాన కారణమని ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు సంవత్సరాల ప్రజాపాలన సంక్షేమం-, అభివృద్ధి పథకాలతో ప్రజలకు చేరువైందని తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, రైతులు, యువత విస్తృతంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం, గ్రామ పాలనా వ్యవస్థలో నూతన దిశకు సంకేతం ఆయన వ్యాఖ్యానించారు.