17-10-2025 05:46:02 PM
అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
నిజాంసాగర్,(విజయక్రాంతి): కార్యకర్తల అభీష్టం మేరకే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష(డీసీసీ ప్రెసిడెంట్) ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి విచ్చేసిన ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ ఖరోలా కు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు.
దేశంలో ఓట్ల చోరీ జరిగిందని, దొంగ ఓట్లతో గెలిచిన దేశ ప్రధాని మోడీ గారు వెంటనే గద్దె దిగాలని రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఓట్ చోర్ - గద్దే చోడ్ " సిగ్నేచర్ క్యాంపెయిన్ (సంతకాల సేకరణ) ఏర్పాటు చేసి కార్యకర్తలు, ప్రజల సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ... పార్టీ కార్యకర్తలు, మండల, బ్లాక్ స్థాయి అధ్యక్షుల అభీష్టం మేరకే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నియామకం జరుగుతుందని అన్నారు. సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయడం శుభపరిణామన్నారు.. ఈ ప్రక్రియ ద్వారా పార్టీ కోసం కష్టపడే నిబద్ధత కలిగిన నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకునే వెసలుబాటు కలుగుతుందన్నారు..
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఎంపిక చేసే అధ్యక్షుడికి మనమంతా సంపూర్ణంగా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా మనమంతా కలిసి పనిచేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.