calender_icon.png 27 January, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీపై వ్యతిరేకత

27-01-2026 01:55:40 AM

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తిరుగుబాటు

మణిపూర్, ఒడిశా, యూపీలో మహిళలకు రక్షణ కరువు

కాషాయ పార్టీపై సామాన్య మహిళల తిరస్కరణ

ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే

హైదరాబాద్, సిటీబ్యూరో జనవరి 26 (విజయక్రాంతి): దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, మహిళా వ్యతిరేక విధానాలపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ధ్వజమెత్తింది. క్షేత్రస్థాయిలో సామాన్య మహిళలు సైతం కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలను గమనిస్తున్నారని, దీంతో కాషాయ పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందని ఐద్వా ప్రధానకార్యదర్శి మరియం ధావలే స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఐద్వా 14వ జాతీయ మహాసభలు సోమవారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన మీడి యా సమావేశంలో ఆమె దేశవ్యాప్త రాజకీయ పరిస్థితులను వివరించారు.

ముఖ్య ం గా మణిపూర్‌లో సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే ప్రజల మధ్య విద్వే షాలు రెచ్చగొట్టారని ఆరోపించారు. అక్కడ మహిళలపై జరిగిన లైంగిక దాడుల ఘటనల్లో నేటికీ ఒక్కరిని కూడా శిక్షించలేదని, ఒత్తిడి పెరిగాక సీఎంను మార్చారే తప్ప శాంతి స్థాపనకు చర్యలు లేవన్నారు. ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రాగానే కుష్ఠు రోగులకు సేవలందించిన గ్రహం స్టెయిన్స్ హంతకుడిని విడుదల చేశారని, ఇది అక్కడి పరిస్థితుల దిగజారుడు తనానికి నిదర్శనమని మరియం ధావలే మండిపడ్డారు. ఒడిశాలో వరి కొనుగోలు, ఉచిత విద్యుత్, పెన్షన్ పెంపు వంటి హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 

నాలుగు కీలక తీర్మానాలు..  

అంతకుముందు మహాసభల్లో ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టిన నివేదికపై 26 రాష్ట్రాల ప్రతినిధులు చర్చించారు. దేశంలో పెరుగుతున్న కార్పొరేట్- హిందూత్వ బంధం, ఆహార భద్రత, ఆరోగ్యం, విద్యా రంగాలపై జరుగుతున్న దాడులను ఈ నివేదికలో ఎండ గట్టారు. ఈ సందర్భంగా మహాసభ నాలుగు ప్రధాన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. సామ్రాజ్యవాద మారణహోమానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలపడం, వెనిజులాపై అమెరికా దాడిని ఖండించడం, దేశంలో పెరుగుతున్న మతతత్వాన్ని వ్యతిరేకించడం, బీహార్‌లో ఓట్ల తొలగింపు కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను ఖండించడం వంటి తీర్మానాలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి  పుణ్యవతి, రాష్ట్ర కార్యదర్శి మ ల్లు లక్ష్మి,  అరుణజ్యోతి,   పాల్గొన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహాసభల ప్రాంగణంలో ఐద్వా మాజీ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలిని భట్టాచార్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఐద్వా అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి రాజ్యాంగ పీఠికను చదివి వినిపించగా, ప్రతినిధులంతా రాజ్యాంగ విలువలను కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశానికి ఏఐకేఎస్ నుంచి విజూ కృష్ణన్, సీఐటీయూ నుంచి సుదీప్ దత్తా, డీవైఎఫ్‌ఐ , ఎస్‌ఎఫ్‌ఐ తదితర సోదర ప్రజా సంఘాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు.  

మహిళల వెతలు తెలిపేలా ..

మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ’ని కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు సోమవారం ప్రారంభించారు. సహజసిద్ధమైన వస్తువులతో, పది మంది మహిళా కళాకారులు రూపొందించిన ఈ చిత్ర ప్రదర్శన స్ట్రెంత్ ఇన్ సాఫ్టనెస్ అనే ఇతివృత్తంతో ఆకట్టుకుంది. కళ కూడా ఒక సాంస్కృతిక విప్లవమేనని, మహిళల నిజ జీవితాలను ఈ చిత్రాలు అద్భుతంగా ఆవిష్కరించాయని మంత్రి కొనియాడారు.