16 June, 2026 | 1:50 AM

వైద్య రంగంలో ఉస్మానియాకు 48వ ర్యాంకు

19-08-2024 01:26 AM

టాప్ 100లో ఉస్మానియాకు మాత్రమే చోటు

ఫార్మాలో 3, డెంటల్‌లో ఒక కళాశాలకు చోటు

ర్యాంకింగ్స్‌లో తెలంగాణ వైద్య కళాశాలలు వెనకంజ

విద్యాసంస్థల ర్యాంకులను ప్రకటించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాం తి): దేశంలో ఉత్తమ విద్యాసంస్థలను ఎంపి క చేసేందుకు కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్స్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ఏటా ర్యాంకిం గ్స్ విడుదల చేస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోని విద్యాసంస్థల ర్యాం కులను ఎన్‌ఐఆర్‌ఎఫ్ ఇటీవల ప్రకటించింది. ఇందులో వైద్య రంగంలో తెలంగాణ కు సంబంధించిన ర్యాంకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు.

కేవలం ఉస్మానియా మెడికల్ కళాశాల మాత్రమే ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించింది. గాంధీ, కాకతీయ వంటి మెడికల్ కళాశాలలే కాకుండా పేరున్న ప్రైవేటు కళాశాలలకు కూడా దేశంలో టాప్-100లో చోటు దక్కలేదు. ఇక ఫార్మాలో హైదరాబాద్‌కు చెందిన నైపర్‌తో పాటు రెండు ప్రైవేటు విద్యాసంస్థలకు, డెంటల్‌లో ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌కు తప్ప మరే విద్యాసంస్థకు చోటు దక్కలేదు. ర్యాంకింగ్స్‌లో చోటు దక్కలేదంటే విద్యాసంస్థల్లో ప్రమాణాలు దిగజారిపోతున్నాయనేందుకు నిదర్శనంగా నిపుణులు పేర్కొంటున్నారు.

తొలిసారిగా ర్యాంకింగ్..

కాగా... 2018 నుంచి మెడికల్ కళాశాలలకు ర్యాంకింగ్‌ను ప్రవేశపెట్టగా 2023 వరకు రాష్ట్రం నుంచి ఏ కళాశాలకు కూడా అవకాశం దక్కలేదు. తొలిసారిగా ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో ఉస్మానియా చోటు దక్కించుకుని రాష్ట్రం పరువును కాపాడింది. కళాశాలల్లో మౌలిక వసతులను పెంపొందించుకునడంతో పాటు అధ్యాపకుల కొరత లేకుండా చూడటం, పరిశోధనకు అవకాశం కల్పించడం, పెద్ద ఎత్తున నిధుల విడుదల వంటి వాటి పట్ల ప్రభుత్వాలు దృష్టి సారిస్తే ర్యాంకింగ్స్‌లో అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ఫార్మాలో రెండో ర్యాంకు..

ఫార్మా రంగంలో ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రానికి చెందిన నైపర్ సత్తా చాటిం ది. జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించి ఈ సంస్థ తెలంగాణకు గర్వకారణం గా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ర్యాంకింగ్స్‌లో గత ఏడాదితో పోలిస్తే ఓ ర్యాంక్ తగ్గింది. గతేడాది ఈ విద్యాసంస్థ దేశంలోనే నెంబర్ వన్ ర్యాంకు సాధించింది. 2022లో రెండవ, 2021లో 6వ ర్యాంకుతో నైపర్ సత్తా చాటుతూ వస్తోంది. ఇక ఫార్మాలో అనురాగ్ యూనివర్సిటీ 71వ ర్యాంక్, విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌స్టిట్యూషన్ అండ్ రీసెర్చ్ 87వ ర్యాంక్ సాధిం చి ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్స్‌లో నిలిచాయి. 

ఆర్మీ డెంటల్ కళాశాలకు 40వ ర్యాంకు

డెంటల్ కాలేజీల్లో తెలంగాణ నుంచి ఒకే ఒక కళాశాలకు చోటు లభించింది. సికింద్రాబాద్‌కు చెందిన ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌కు జాతీయ స్థాయిలో 100 లోపు ర్యాంకుల్లో 40వ ర్యాంకు వచ్చింది. రాష్ట్రం నుంచి మరో 8 డెంటల్ కాలేజీలు సైతం ర్యాంకింగ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నా వాటికి వందలోపు అవకాశం దక్కలేదు. ఇక వ్యవసాయ విద్యలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో 37వ ర్యాంకులో నిలిచింది.

ఉస్మానియాకు 48వ ర్యాంకు..

ఎన్‌ఐఆర్‌ఎఫ్... కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ర్యాంకింగ్ వ్యవస్థ ఇది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ ర్యాంకింగ్స్‌కు ఎంతో గుర్తింపు ఉంది. ఈ ర్యాంకింగ్స్ ఆధారితంగా విద్యార్థులు ఆయా కళాశాలల్లో చదివేందుకు మొగ్గు చూపుతారు. మరోవైపు ఈ టాప్ ర్యాంకింగ్ కళాశాలలో బోధనా పద్ధతులు, మౌలిక వసతులు సైతం అద్భుతంగా ఉంటాయి. పరిశోధన రంగాలకు సైతం ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. ప్లేస్‌మెంట్స్ పరంగానూ ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ముందున్న కళాశాలల్లో చదివే విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.  ఇప్పుడు ప్రతి అంశానికి ర్యాంకింగే కొలమానం కావడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలు ర్యాంకింగ్‌పై దృష్టి సారించాయి.

అందుకనుగుణంగా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నాయి. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ కోసం 4 కళాశాలలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి.ఉస్మానియాతో పాటు అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చల్మెడ ఆనంద్‌రావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీ  ర్యాంకింగ్స్ కోసం ప్రయత్నించాయి. కానీ అవకాశం దక్కలేదు. తెలంగాణ నుంచి మెడికల్ కాలేజీల ర్యాంకింగ్స్‌లో ఉస్మానియాకు మాత్రమే జాతీయ స్థాయిలో టాప్ 100లో చోటు దక్కింది. ఇందులో ఉస్మానియా మెడికల్ కాలేజీ 48వ ర్యాంకు సాధించింది.