calender_icon.png 7 July, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా బతుకులు మా భూముల్లనే

30-06-2025 12:00:00 AM

చేతుల్లో అధికారం

పచ్చకామెర్లకు మా చెలుకలే బలి

సెజ్‌లని, కంపెనీలని

ఫార్మాహౌజ్ లని, ఐటీ పార్క్‌లని

ఇథనాల్ ఫ్యాక్టరీలని, గోశాలలంటూ

ఏవేవో పేర్లతో మా భూమిలో 

వాలిన డేగలు....

నన్ను గొర్రెను చేస్తున్నారు

నా భూమి దగా పడ్డది

తరతరాలుగా మీ పేరుమీద 

వందల వేల ఎకరాల 

భూములున్నట్లు రికార్డులు.....

అవేవి ప్రజా అవసరాలకు పనికిరావా ?

అసైన్డ్ భూములు, పేదల భూములంటే

కళ్లు పొడుచుకొస్తాయి

ఎకరా పొలం.. ముగ్గురు బిడ్డలు 

ఉన్న మూరెడూ భూమి పోతే

సదువెట్ల బతుకు దారెట్ల?

ఏ ఊరేతేనేమి మట్టిచేతులతోటి

తన భూమిలో తానే కూలి

గింజగింజపై తినే వాడి పేరుంది 

కానీ పండించిన వారి శ్రమ అదృశ్యం

హాలికుడంటే కర్షకుడంటే  

పరాయితనమేనా?

దేశానికి వెన్నెముక రైతే

తాను తీర్చేది ఆకలే

దున్నేవాడి పొట్ట గొట్టడం ఏ చట్టం

ఉన్న కొద్దీ భూమిలోనే వెలుగు ఉపాథి 

చావు పుట్టుకలు ఆ నేలలోనే 

మీ ఆలోచనలకు వికాసాలకు 

మా వ్యతిరేకతలేదు.. కానీ 

నాగళ్ళెత్తిన చేతులకు బేడీలు, జైళ్లు

మీరు సష్టిస్తున్న పద్మవ్యూహానికి 

మీ అణచివేతలకు మేమే బలైపోవాలా..

మీ సంక్షేమాలు మాకక్కరలేదు 

మా భూములు మాకు ఉంచండి 

మా బతుకేదో మేం బతుకుతాం

మా భూముల్లోనే..

(రైతుల పోరాటానికి మద్దతుగా)