calender_icon.png 30 January, 2026 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగీరథా.. నీరు రాదా?

30-01-2026 12:25:20 AM

యరగండ్లపల్లి, కొండూరు గ్రామాలకు తప్పని నీటి కష్టాలు 

పూరేనా గుట్ట మూల మలుపు వద్ద పగిలిన మెయిన్ లైన్ పైపులు 

అక్కడ వృధా.. ఇక్కడ వ్యధ..                    

నెల రోజులు దాటినా తీరని నీటి వ్యధ

మరమ్మత్తులు చేపట్టి.. నీరు సరఫరా చేయాలంటూన స్థానికులు 

మర్రిగూడ, జనవరి 29: తాగునీటికి ఇబ్బందులకు కలగకూడదని లక్ష్యంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు కృష్ణానది నీటి సరఫరా కు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే గ్రామ గ్రామానికి పైపులైన్ లను ఏర్పాటు చేసింది. అయితే వాటి నిర్వహణ సక్రమంగా లేని కారణంగా గ్రామాలకు భగీరథ నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో పలు గ్రామాల ప్రజలకు నీటి కష్టాలు తీరడం లేదు. దీంతో భగీరథా.. నీరు గ్రామాలకు రాధా.. అనే ప్రశ్నలు ఆయా గ్రామాల ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇదే పరిస్థితి ప్రస్తుతం మర్రిగూడ మండలంలోని యరగండ్లపల్లి, కోడూరు గ్రామాలలో నెలకొంది. ఈ గ్రామాలలో భగీరథ నీటి సరఫరా ఆగమ్యగోచరంగా మారింది. నెల రోజులకు పైగా ఇంటింటి నీటి సరఫరా తగ్గిపోవడంతో ఆయా గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

నెల రోజులుగా నీరు వృధా

పూరేనా గుట్ట మూలమలుపు వద్ద మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ పగిలిపోవడంతో నెల రోజులుగా నీరు వృధాగా మెయిన్ రోడ్డుపై పారుతుంది.  భగీరథ అధికారులు అక్కడి నుండి విధులకు వెళ్ళుచున్నారే తప్ప మరమ్మత్తులు చేపట్టాలన్న ఆలోచన మాత్రం వారికి రాకపోవడం గమనార్హం. 

రెండు గ్రామాలకు తీరని వ్యధ 

యరుగండ్లపల్లి, కొండూరు గ్రామాలకు కృష్ణ నీరు సరఫరా నెలరోజుల పైగా తగ్గుముఖం పట్టడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవికంగా యరగండ్లపల్లి, కొండూరు గ్రామాలకు నాంపల్లి మండలం స్వామివారి లింగోటం (బట్లపల్లి) వాటర్ గ్రిడ్ నుండి పంపింగ్ జరుగుతాయి. ప్రస్తుతం ఈ నీరు గ్రామానికి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రెండు గ్రామాల ప్రజలు ఫిర్యా దులను ఇచ్చినా అటు ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకు గాని, గ్రిడ్ అధికారులు గానీ పట్టించుకోకపోవడం గమనార్హం.

కింది స్థాయి సిబ్బందికి ఈ విషయం తెలిపినా మా విధులు మేము నిర్వహిస్తున్నాం.. భగీరథ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే నడుచుకుంటాం అనే సమాధానం వారినుండి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్, గ్రిడ్  ఉన్నతాధికారులకు విన్నవించినా కనీసం జవాబుదారిగా ఫోన్ ద్వారానైనా సమాధానం చెప్పకపోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా భగీరథ ఉన్నత అధికారులు పూరైనా గుట్ట మూలమలుపు వద్ద పగిలిపోయిన మెయిన్ లైనును మరమ్మత్తులు చేపట్టి  యరుగండ్లపల్లి, కొండూరు వాసులకు నీటి కష్టాలు తొలగించాలని కోరుతున్నారు. 

నీటి సరఫరాను పునరుద్ధరించాలి

గ్రామంలోని పూరేనా గుట్ట మూలమలుపు వద్ద రోడ్డుపై మెయిన్ పైపు లైను లీకేజీ మరమ్మత్తులు చేపట్టి కృష్ణా నీటిని గతంలో లాగా పునరుద్ధరించాలి. నెల రోజులుగా భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో రెండు గ్రామాలకు చెందిన వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తక్షణం వాటర్ గ్రిడ్ అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టి త్రాగునీరు అందించి ఇబ్బందులు తొలగించాలి.

 వల్లముల యాదయ్య, 

వార్డు సభ్యుడు, యరగండ్లపల్లి