30-01-2026 12:00:00 AM
బంగారం, వెండి సామాన్యుడికి దూరంగా పరిగెడుతున్నాయి. ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకొని కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తు న్నాయి. గురువారం భారత్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1.8 లక్షల మార్కును దాటేసి 2 లక్షల దిశగా పరుగులు పెడుతున్నది. అటు వెండి ధర కూడా కిలో రూ.4 లక్షల మైలురాయిని దాటింది. రాబోయే కాలంలో బంగారం మూడు లక్షల మార్క్‌ను దాటే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతలా బంగారం, వెండి ధరలు పెరిగిపోవడానికి కారణాలు అనేకం.
ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు బంగారం ధర పెరిగినట్లు చరిత్ర చెబుతుంది. రెండో ప్రపంచ యుద్ధం, 1970లో చమురు సంక్షోభం, 2008లో ఆర్థిక మాంద్యం, కోవిడ్-19 ముప్పు తలెత్తినప్పుడు బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. తాజాగా రష్యా యుద్ధంతో మొదలైన బంగారం ధర పెరుగుదల ఆపకుండా పరుగులు తీస్తూనే ఉన్నది. డీ వెలుగులోకి రావడం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో కారణం.
అంతర్జాతీయ వాణిజ్య కరెన్సీగా డాలర్ స్థానంలో సొంత కరెన్సీలను ప్రోత్సహించడానికి వివిధ దేశాలు ప్రయత్నించడాన్ని డీ పిలు స్తున్నారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు చైనా, రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాకా ఆయన అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు, సుంకాల విధింపు లాంటి చర్యలు బంగారం ధరలను పరుగు పెట్టించాయని చెప్పొ చ్చు. ట్రంప్ చర్యలతో పలు దేశాలు డాలర్ బాండ్లలో పెట్టుబడులు తగ్గించి, బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి.
ఇక వెండి ధర పెరగడం వెనుక సరఫరా కొరత, పారిశ్రామిక డిమాండ్ కారణాలుగా ఉన్నాయి. ప్రపంచంలో వెండి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న చైనా వనరులను, పర్యావరణాన్ని రక్షించే ఉద్దేశంతో, వెండితో పాటు టంగ్‌స్టన్ ఇతర లోహాల ఎగుమతులపై కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు ఇది వరకే ప్రకటించింది.
ఆర్థిక భద్రతపై అనుమానాల నేపథ్యంలో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం, ఆర్థిక అనిశ్చితి, ద్రోవ్యోల్బణంపై ఆందోళన, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తి చూపడం పెరుగుదలకు కారణమైంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక కూడా ఇదే చెబుతున్నది. 2025తో పోలిస్తే ఈ ఏడాది బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నట్లు తెలిపింది.
రికార్డు స్థాయిలో ధరలు పెరగడంతో భారత్‌లో వినియోగదారుల నుంచి కొనుగోలు తగ్గిపోవడం వల్ల భారత్‌లో గతేడాది పుత్తడికి డిమాండ్ తగ్గిందని డబ్ల్యూజీసీ తెలిపింది. ప్రస్తుత తరుణంలో బంగారం, వెండి ధరలు దిగిరావాలంటే.. రష్యా యుద్ధం ఆగాలి. ట్రంప్ సుంకాల ప్రభావం, ఆర్థిక మందగమనం విషయంలో స్పష్టత రావాలి.
వడ్డీ రేట్లు పెరగాలి, ద్రవ్యోల్బణం తగ్గాలి. బం గారం, వెండి ధరల పెరుగుదలను కేవలం పెట్టుబడి అవకాశంగా మాత్రమే చూడకూడదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అస్థిరతకు, అప్పుల భారానికి స్పష్టమైన హెచ్చరిక. రాబోయే కాలంలో ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.