30-06-2025 12:00:00 AM
అమ్మ ఆస్యం సింగారం లేని సింగిడి
నన్ను జూస్తెనే తీరుతది
ఆ ఆస్యంల అలజడి
మా ఇంటిచుట్టూ ఈది దీపాలే
అయినా అమ్మ మోమున అంధకారమే
ఎరకయింది అయ్య రాలేదని
మా అయ్య కిర్రు చెప్పుల సప్పుడుతో
వస్తది మా యింటికి ఎలుగు -
ఆ సప్పుడు ఇంటెనే దిగుతది
మా అమ్మ గుండె దిగులు
అయ్య కంచంల నాలుగు మెతుకులు
ఎప్పుడూ ఎక్కువే అయితయి
అమ్మేమో అసలు మాతో కలిసి తినదు
అమ్మ ఏదో తింటంది-
అమ్మ ఏదో తింటంది
పసిపాన మాయె
ఎట్లయినా సూడాలనిపిచ్చేది
ఏం తింటందో సూద్దామని
నేనెప్పుడు పంటనో
తిందామని అమ్మ ఎప్పుడూ
అమ్మే గెలిచేది.. అమ్మ కదా మరి!
ఇప్పుడు అర్థమైంది నాకు
అయ్యాల నాకేదో పీడక లొచ్చింది
ఇయ్యాల అమ్మ దొరికి పోయింది
అయ్యకు ఆకలి సగమే ఎందుకయితదో
పాచిపోయిన అన్నమే
అమ్మకు పరమాన్నమని,
గంజి మెతుకులు గటకే
అమ్మకు అంబలి అని.
ఇప్పుడు తెలిసింది నాకు
అమ్మను అడిగితే అంటది
అయ్యా పానం నిమ్మలం లేదు
గిదైతే గింత అతుకుతదని.
ఇండ్లకైత ఉందో లేదో గాని
నా గుండెల ఆర్ధముంది
అమ్మా! ఇంకో జన్మకు గూడా
నీ గర్భగుడిలో గింత జాగ దాస్తవా?