30-01-2026 12:40:54 AM
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పార్టీలు
పోటీకి ముందుకు రాని అభ్యర్థులు
ప్రధాన పార్టీలకు సైతం అభ్యర్థుల కొరత
మేడ్చల్ జిల్లాలో పరిస్థితి
మేడ్చల్, జనవరి 29 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థుల కొరతను ఎదు ర్కొంటున్నాయి. బి ఫారం ఇస్తామన్నా మూడు మున్సిపాలిటీలలో అభ్యర్థులు పోటీకి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ బిజెపి ఇతర పార్టీలకు కొన్ని వార్డులలో అభ్యర్థులు దొరకడం లేదు. జనరల్ వార్డులలో పలువురు టికెట్లు ఆశిస్తున్నప్పటికీ రిజర్వుడు వార్డులలో ఎవరో ఒకరిని బలవంతంగా పోటీకి నిలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థి లేని చోట ఇతర పార్టీల నుంచి పార్టీలో చేర్చుకొని టికెట్లు ప్రకటిస్తున్నారు. ఇతర పార్టీల కంటే అధికార పార్టీ టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉండాలి.
కానీ అధికార పార్టీ టికెట్లకు సైతం పెద్దగా డిమాండ్ లేదు. కొన్ని వార్డులలో టికెట్లు ఇస్తామన్నా వద్దని మొహం చాటేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎల్లంపేట మున్సిపాలిటీ ఎస్టీ మహిళ, అలియాబాద్ జనరల్ మహిళ, మూడు చింతలపల్లి ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. చైర్ పర్సన్ రిజర్వేషన్ అనుకూలంగా వస్తే, వార్డు కౌన్సిలర్ పదవులకు డిమాండ్ ఏర్పడేది. చైర్ పర్సన్ పదవి రిజర్వేషన్ అనుకూలంగా వస్తే వార్డు రిజర్వేషన్ అనుకూలంగా రాలేదు. వార్డు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే చైర్ పర్సన్ రిజర్వేషన్ అనుకూలంగా రాలేదు. దీంతో ఆశావహుల ఆశలు గల్లంతయ్యాయి.
టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పార్టీలు
మున్సిపల్ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ పార్టీలు ఈసారి బరిలో దిగడానికి సిద్ధమయ్యాయి. పోటీ చేయాలని ఉత్సాహంగా ఉన్నవారికి బీఫారాలు ఇస్తామని ప్రకటించాయి. ప్రతిసారి మూడు పార్టీలు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచేవి. ఈసారి తెలంగాణ జాగృతి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, జనసేన కూడా పోటీ చేస్తామని ప్రకటించాయి. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందలేదు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు చెందిన సింహం గుర్తుపై పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించుకుంది.
బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీల నాయకులు సమావేశమై అవగాహన చేసుకున్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సైతం బరిలో దిగనుంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరి శంకర్ గౌడ్ మేడ్చల్ లో పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం కూడా నిర్వహించారు. ఆసక్తి ఉన్నవారికి బీఫారాలు ఇస్తామని ప్రకటించారు. ఈ పార్టీకి ఎన్నికల సంఘం కత్తెర గుర్తు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన సైతం పోటీ చేయనుంది. ఇప్పటికే కొన్ని వార్డులలో ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
ఖర్చుకు భయపడి వెనుకడుగు
మున్సిపల్ ఎన్నికల్లో చాలామంది అభ్యర్థులు ఖర్చులకు భయపడుతున్నారు. పోటీకి వెనుకడుగు వేయడానికి ఇది కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఒక్క వార్డుకు సుమారు 1000 ఓట్లు ఉన్నాయి. 20 లక్షల రూపాయల ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇంత ఖర్చు చేసిన గెలుస్తామని గ్యారెంటీ లేదు. అధికార పార్టీ తరఫున పోటీచేసిన గెలుస్తామని నమ్మకం లేదు. పార్టీ ఫండ్ ఇస్తామని ఆయా పార్టీలు ప్రకటించడం లేదు. దీంతో పోటీకి అనాసక్తి చూపుతున్నారు.