30-01-2026 12:00:00 AM
గూడెంలో కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు లేనట్లే సై అంటున్న నేతలు..
తొలి మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఎత్తులు.. జిత్తులు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 29, (విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, సిపిఐ పార్టీలు కార్పొరేషన్ ఎన్నికల్లో సై అంటే సై అంటున్నారు. కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం కార్పొరేషన్ లో తొలి మేయర్ పీఠం దక్కించుకునేందుకు రెండు పార్టీల నేతలు ఎవరికి వారే ఎత్తులు, జిత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా పేరు ఉన్న కొత్తగూడెం నియోజకవర్గాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి కేటాయించారు.
అప్పటి నుంచే కాంగ్రెస్ కేడర్లో తీవ్ర అసంతృప్తి చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీతో గెలుపొందిన సిపిఐ పార్టీ మేయర్ పీఠం కూడా దక్కించుకోవాలని పట్టు మీద ఉంది. అందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పడంతో రెండు పార్టీల మధ్య పొత్తు బెసికిందనే చెప్పవచ్చు. దీంతో రెండు పార్టీలు సై అంటే సై అంటూ పోటీకి దిగుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారై, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరిన దాఖలాలు లేవు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ జోరు అందుకుంది.
కార్పొరేషన్ గా ఏర్పడిన తర్వాత తొలి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. గెలుపు గుర్రాలను వేటాడి బరిలో దింపే పనిలో నాయకులు తలమునకయ్యారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు నేరుగా డివిజన్ ప్రజలతో కలిసి ప్రచారం సైతం చేపట్టారు. ఈ రసవత్తరమైన పోటీలో మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీతో ఏ పార్టీ జతకట్టే అవకాశాలు ఉంటాయని దానిపై ప్రజల్లో తీవ్ర చర్చ చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీకి సై అంటే సై అంటున్నాయి.
ఈ ఎన్నికల్లో బిజెపి బరిలో ఉన్న ఆ పార్టీ ప్రభావం అంతంతం మాత్రమే చెప్పవచ్చు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బి ఆర్‌ఎస్ పార్టీ సైతం బరిలో ఉంది. ఈ క్రమంలో సిపిఐ, తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిపిఎంతో ఒప్పందం కుదుర్చుకొని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో గల 60 డివిజన్లలో రెండు డివిజన్లను సిపిఎం పార్టీకి కేటాయించే ఒడంబడిక కుదిరింది. బిఆర్‌ఎస్ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించక లేదు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తగూడెం కార్పొరేషన్ లో ఇన్చార్జిలను ఇప్పటికే ప్రకటించారు. నియోజకవర్గ ఇన్చార్జిల నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. సిపిఐ కూటమితో బిఆర్‌ఎస్ లోపాయకార ఒప్పందం కుదుర్చుకున్నట్లు నియోజకవర్గంలో గుసగుస.
రాష్ట్రంలో దోస్తీ... గూడెంలో కుస్తీ...
గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పొత్తుతో గెలుపొందిన సిపిఐ ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు డి అంటే డి అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. పరస్పర మాటలతో, విమర్శలతో కాంగ్రెస్ సిపిఐ మధ్య దోస్తీ చెడిందనే భావన ప్రజల్లో తలెత్తింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే సాంబశివరావు స్నేహపూర్వకమైన పోటీ ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల సిపిఐ 100 ఏళ్ళ ముగింపు ఉత్సవ సభలోను సీఎం రేవంత్ రెడ్డి దేశ భవిష్యత్తు కోసం కలిసి పోరాడుతామంటూ మాట్లాడారు. కొత్తగూడెంలో మాత్రం కాంగ్రెస్, సిపిఐ మధ్య అభిప్రాయ భేదాలు తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెంలో మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుందని హస్తం నేతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఏ పని కావాలన్నా ఏ ప్రాంతంలో సిపిఐ నేతల పెత్తనం కొనసాగుతుండటంతో కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదనే వాదన సైతం వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ,సిపిఐ దోస్తీ రాష్ట్రం మొత్తం ఒకవైపు, కొత్తగూడెం నియోజకవర్గ మరోవైపు అన్నట్లుగా ఉంది.
సత్తా చాటేందుకు సమాయత్తం..
తొలిసారిగా జరుగుతున్న కొత్తగూడం కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, సిపిఐ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కలిసి పని చేద్దామని నేతలు చెబుతున్న క్యాడర్ మాత్రం అందుకు అంగీకరించటం లేదని తెలుస్తోంది. కలసి వస్తే సీపీఐ పార్టీకి 16 సీట్లు ఇస్తామని ప్రతిపాదన పెట్టగా అందుకు ఆ పార్టీ నిరాకరించి ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎవరికి వారు ఢీ అంటే ఢీ అన్నట్టుగా అభ్యర్థులను పోటీలో నిలబెడుతున్నారు. ఎలాగైనా తొలి మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నోటిఫికేషన్ జారీ కంటే ముందే రెండు పార్టీలు డివిజన్ల వారీగా మీటింగ్లు నిర్వహించి అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామ్ సహాయం రఘురాం రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి గెలిపే లక్ష్యంగా పావుల కదుపుతున్నారు. మరోవైపు సిపిఐ వరుస సమావేశాలతో తలమునకై ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కాంగ్రెస్, సిపిఐ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఓటరు దేవుళ్ళు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా, ప్రజల మధ్య నిత్యం ఉంటూ ప్రశ్నించే గొంతు గా చెప్పుకునే సిపిఐ ను ఆదరిస్తారా వేచి చూడాలి.
25 సంవత్సరాల తర్వాత పాల్వంచకు ఎన్నికల కళ..
1987 వరకు మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న పాల్వంచను తృతీయ శ్రేణి పొరపాలకంగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమరం రాములు మున్సిపల్ చైర్మన్ గా, వర్మ వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ గా, అనంతరం మూడు సంవత్సరాల ఆలస్యంగా 1995లో జరిగిన ఎన్నికల్లో బన్సీలాల్ మున్సిపల్ చైర్మన్ గా , కిలారు నాగేశ్వరరావు వైస్ చైర్మన్ గా 1995 నుంచి 2000 వరకు పాలకవర్గం కొనసాగింది. తర్వాత ఏజెన్సీ ,నాన్ ఏజెన్సీ వివాదంతో అంశం కోర్టు వరకు చేరిందని సమాధానం చెబుతూ గత 25 ఏళ్లుగా పాలకవర్గం లేకుండా ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది.
తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రార్థన వహిస్తున్న సాంబశివరావు కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు, సుజాతనగర్ మండలంలోని కొన్ని పంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేశారు. దీంతో పాల్వంచ వాసులకు 25 ఏళ్ల తర్వాత వేలుకు ఇంకు అంటించుకునే భాగ్యం కలిగింది. ప్రస్తుతం పాల్వంచలో ఎన్నికల కోలాహలం నెలకొంది.