calender_icon.png 22 July, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుకు బేడీలా?

13-12-2024 02:09:44 AM

  1. సంగారెడ్డి పోలీసులసై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్
  2. బేడీలతో ఆసుపత్రికి తీసుకెళ్లడంపై ఆగ్రహం
  3. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
  4. సంగారెడ్డి జైలులో ఐజీ సత్యనారాయణ విచారణ
  5. జైలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్/సంగారెడ్డి, డిసెంబర్ 12 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో అరెస్టు అయి జైలులో రిమాండ్‌లో ఉన్న రైతు హీర్యానాయక్‌ను చేతికి బేడీలతో సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతును బేడీలతో తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు.

ఈ ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించబోదని హెచ్చరించారు. రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో తీవ్ర విమర్శలు రావడంతో సీఎం స్పందించి నివేదిక కోరారు.  

సంగారెడ్డి జైలులో ఐజీ విచారణ

సంగారెడ్డి జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ హీర్యానాయక్‌కు చాతినొప్పి రావడంతో ఆయనను బేడీలతో దవాఖానకు తీసుకెళ్లిన ఘటనపై మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ విచారణ చేశారు. మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ, సంగారెడ్డి ఎస్పీ చెన్నూరు రూపేశ్ గురువారం సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లారు. 

దాదాపు నాలుగు గంటలపాటు జైల్లో ఐజీ విచారణ చేశారు. జైల్లో పోలీసులతోపాటు ఖైదీలతో మాట్లాడి వివరాలు సేకరించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్టు విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. వికారాబాద్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జైలు అధికారులు, జైలు రికార్డులో హీర్యానాయక్ బాలానగర్‌లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నట్టు రికార్డులు రాయడంపై ఆరా తీశారు.

జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా చేశారా? పొరాపాటు జరిగిందా? అనే కోణంలో విచారణ చేశారు. గురువారం ఉదయం ఏఱూ2 సురేశ్ జైల్లో వ్యవరించిన తీరుతో మరింత అనుమానం పెరిగిందని తెలిసింది. ఎవరితోనో ఫోన్‌లో సురేశ్ మాట్లాడినట్టు తెలిసింది. హీర్యానాయక్‌కు గుండె నొప్పి ఉందని న్యాయ వాదులకు, మీడియాకు సమాచారం ఇస్తే గంటలో బెయిల్ వస్తుందని చెప్పినట్లు సమాచారం. సురేశ్ ఫోన్‌లో ఎవరితో మాట్లాడారని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో సంగారెడ్డి జైలు జైలర్ సంజీవరెడ్డిపై జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా సస్పెన్షన్ వేటు వేశారు. 

బాలానగర్ పీఎస్‌లో అరెస్టయినట్టు లేఖ 

వికారాబాద్‌లో అరెస్టు చేసిన హీర్యానాయక్‌ను జైలు అధికారులు బాలానగర్ పోలీసుస్టేషన్‌లో అరెస్టు చేసినట్లు సర్కార్ ఆసుపత్రికి లేఖ రాసినట్టు తెలిసింది. హీర్యానాయక్ అనారోగ్యంతో ఉన్నారని, వైద్యం చేయాలని సంగారెడ్డి సెంట్రల్ జైలు అధికారులు లేఖ రాశారు.

హీర్యానాయక్‌పై వికారాబాద్ జిల్లాలో కేసు నమోదు కాగా, సంగారెడ్డి పోలీసులకు కాకుండా, కేసుకు సంబంధం లేని సైబరాబాద్ పోలీసులకు లేఖ రాయటం వెనుక ఎవరైనా కుట్ర చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది.

లగచర్ల కేసులో ఉన్న సురేశ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు బేడీలు వేసిన ఘటనపై విచారణ చేసి ప్రభుత్వనికి నివేదిక ఇస్తామని పోలీసు అధికారులు తెలిపారు.