21 August, 2026 | 1:46 AM

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని పాదయాత్ర

21-08-2026 12:00 AM
  1. వాంకిడి నుంచి ఎర్రవల్లి వరకు 300 కి.మీ 11 రోజులు
  2. అభిమానులు ఇద్దరినీ ఆప్యాయంగా పలకరించిన బీఆర్‌ఎస్ అధినేత

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో ఇద్దరు సామాన్య గిరిజన అభిమానులు సుమారు 300 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన జాడే తిరుప తి, దుర్గం శంకర్ 11 రోజులపాటు కాలినడకన గురవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. జాడే తిరుపతి ఆటో డ్రైవర్ గా, దుర్గం శంకర్ హోటల్ కార్మికుడిగా పనిచేస్తున్నారు.

కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో, ఆయన మళ్లీ సీఎం కావాలనే ఏకైక సంకల్పంతో పాదయాత్ర చేపట్టినట్టు వారు తెలిపారు. ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం, వినతిపత్రం లేకుండా కేవలం కేసీఆర్‌ను కలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సుధీర్ఘ ప్రయాణం చేసినట్టు వారు వెల్లడించారు. రోజుకు సగటున 25 కిలోమీటర్ల చొప్పున 11 రోజులు నడి చి ఎర్రవల్లికి చేరుకున్నవారిని కేసీఆర్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

పాదయాత్ర చేపట్టిన అభిమానుల నిస్వార్థ సంకల్పాన్ని కేసీఆర్ అభినందించారు. వారి అభిమానానికి ప్రశంసలు కురిపిస్తూ భుజం తట్టారు. ‘మళ్లా మన ప్రభుత్వమే వస్తున్నది.. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి’ అంటూ వారిని ఉత్సాహపరిచారు. అనంతరం కేసీఆర్ వారికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి, వారి స్వగ్రామానికి తిరిగి వెళ్లే లా ఏర్పాట్లుచేశారు. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ఆదిలాబాద్ అడవి బిడ్డలు చేపట్టిన ఈ పాదయాత్ర బీఆర్‌ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.