19-12-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లను వేయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, వసతి గృహాలు నిర్వహణపై ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీఎంలతో కలెక్టరేట్ మొదటి అంతస్తులోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేసిన ధాన్యంను వెంట వెంటనే మిల్లులకు తరలించాలని, రవాణా చేయు సందర్భంలో వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని, మారుతున్న వాతావరణ మార్పుల సమాచారం రైతులకు తెలియపర్చలని, సిబ్బంది ప్రతీ ఒక్కరూ ఫీల్ లో ఉండాలని సూచించారు.
ప్రస్తుత శీతాకాల నేపథ్యంలో జిల్లాలోనీ అన్ని వసతి గృహాలను ప్రత్యేక అధికారులు, హాస్టల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీలు నిత్యం తనిఖీ చెయ్యాలని, హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ పై అవగాహన కల్పించి పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లల మానసిక ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని పిల్లలకు సరిపడ దుప్పట్లు, అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు.
పదవ తరగతి పరీక్షలు వస్తున్నదున్న ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, డిజిటల్ తరగతులు నిర్వహించాలని, వసతి గృహాలలో డైట్ మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన వేడి,వేడి ఆహారాన్ని అందించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, ఏడి ఎస్‌ఎల్‌ఆర్ నరసింహ మూర్తి, డిఏఓ విజయనిర్మల, డి ఎం సివిల్ సప్లై కృష్ణవేణి, డీఎస్‌ఓ రమేష్, మండల ప్రత్యేక అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండల కేంద్రాల నుండి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఏపీఎంలు, ఎంపీఓలు పాల్గొన్నారు.