16-12-2024 02:16:28 PM
మొదటి పేపర్ పూర్తి, రెండో పేపర్ కూడా రాస్తానంటూ పట్టు విడవని గర్భిణీ
తనకోసం వైద్య సిబ్బంది, అంబులెన్స్ సిద్ధం చేసిన అధికారులు.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ఉద్యోగం సాధించాలన్న తపనతో ఓ నిండు గర్భిణి గ్రూప్-2 పరీక్షలు రాస్తుండగా పరీక్ష హాల్లోనే పురిటినొప్పులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తనకోసం ప్రత్యేకమైన అంబులెన్స్ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి అత్యవసరమైతే అక్కడే ప్రసవం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం గ్రూప్-2 మొదటి పేపర్ పూర్తవగా రెండో పేపర్ కూడా రాస్తానంటూ గర్భిణీ మొండికేయడంతో వైద్య సిబ్బంది ధైర్యంగా అక్కడే ఉంటూ ప్రసవం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద సోమవారం చోటు చేస్తుంది. బాల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి (25) రెండో కాన్పు నిండు గర్భం దాల్చి ఉంది. వైద్యాధికారులు కూడా డెలివరీ డేట్ సోమవారమే ఫిక్స్ చేశారు.
కానీ చాలాకాలంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో చాలా కష్టపడి చదివి గ్రూప్-2 పరీక్షల కోసం వేచి చూసింది. పురిటి నొప్పులతో బాధపడుతూనే ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలన్న పట్టుదలతో పరీక్షలు రాస్తుంది. మొదటి రోజు ఆదివారం కూడా సాపీగానే పరీక్షలు రాయగా సోమవారం మాత్రం ఉదయం సమయంలో పరీక్షలు రాస్తుండగా పురిటి నొప్పులు రావడంతో అది గమనించిన సిబ్బంది వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసారు. జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ దృష్టికి తీసుకువెళ్లడంతో తనకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో ప్రత్యేక అంబులెన్స్ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి ధైర్యం చెప్పారు. తప్పని పరిస్థితుల్లో ప్రసవ కోసం ఏర్పాట్లు చేశారు. తీవ్రమైన పురిటి నొప్పులను అనుభవిస్తూనే పరీక్షలు రాస్తుండడం అందరినీ కలిచి వేస్తోంది.