29-08-2025 01:00:33 AM
మరికొందరు పరారీ
మేడ్చల్, ఆగస్టు 28(విజయ క్రాంతి): నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇళ్ల స్థలాలు విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాచకొండ ఎస్‌ఓటి, కీసర పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో నివాసముంటున్న బిగు గూడెం అరవింద్, సంపంగి సురేష్, ఈగ హరిప్రసాద్, రామంతపూర్ కు చెందిన చెక్కల సోమనాథ్, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండ లం సుద్దపల్లికి చెందిన కోట్ల నాగేంద్రప్రసాద్, సైదాబాద్ కు చెందిన మహమ్మద్ హుస్సేన్, ఇబ్రహీంపట్నం మండలం ముకునూరుకు చెందిన యంజాల శేఖర్, విజయవాడకు చెందిన వీరమాచినేని వనజ ముఠాగా ఏర్పడ్డారు.
ఖాళీ స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని విక్రయించాలని పథకం వేశారు. మొదట సేల్ డీడ్ మాత్రమే ఉన్న ప్లాట్లను గుర్తించి ఆ తర్వాత ఈ సి, సర్టిఫైడ్ సెల్ డిడ్ కాపీలను తీసి వాటి ద్వారా నకిలీ పత్రాలను తీసి విక్రయిస్తున్నారు.
బతికుండగానే చనిపోయినట్లు సర్టిఫికెట్
ప్లాట్ యజమాని బతికుండగానే చనిపోయాడని, ఆయన భార్య కూడా మృతి చెందిందని ఫేక్ డెత్ సర్టిఫికెట్ తయారు చేసి, వారి వారసురాలిగా ఓ యువతికి డబ్బు ఆశ చూపి ఒప్పించారు. ఆమె ద్వారా 75 లక్షల రూపాయల విలువచేసే ప్లాటును విక్రయం చేయించారు. ఈ విషయం తెలుసుకున్న యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ ముఠా నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయించడమే గాక, కోర్టులలో కేసు వేసి యజమాను లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తేలింది.
ఇప్పటివరకు వీరు మొత్తం ఐదు ప్లాట్ లకు నకిలీ పత్రాలు సృష్టించారు. ఇందులో మూడు ప్లాట్లు విక్రయించారు. ఈ ముఠాలో కొందరిపై ఇదివ రకే కేసులున్నాయి. అమరేందర్, మాణిక్, అహ్మద్, సునీల్ కుమార్ తో పాటు మరికొందరు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద కంప్యూటర్, లాప్టాప్ ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్ ఆఫీసు సిబ్బంది పాత్ర పై పోలీసులు దర్యాప్తు చేయాలని పలువురు కోరుతున్నారు.