09-05-2025 01:25:22 AM
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, మే 8 : పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు భారత ప్రభుత్వం దీటైన జవాబు ఇవ్వాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన తన పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బుధవారం ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా పాకిస్తాన్ పశ్చాత్తాపం లేకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.
భారత ప్రభుత్వం సరైన విధంగా వ్యవహరించి దాడులు చేసిందని, అందులో పాల్గొన్న త్రివిధ దళాలకు శుభాకాంక్షలు తెలిపారు. “భారతదేశ సరిహద్దు, అంతర్గత భద్రతకు సంబంధించి రాజకీయాలు లేవు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పష్టంగా చెప్పింది. భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. శత్రువులకు సరైన బుద్ధి చెప్పే విధంగా కఠినంగా వ్యవహరించాలి” అని అన్నారు.
తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. ఎవరైనా సెన్సిటివ్ అంశాలను దుష్ర్పచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రిగా, హైదరాబాద్‌కు సంబంధించి పోలీసు, రెవెన్యూ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చిన్న అనుమానాస్పద అంశం వచ్చినా పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. సైనికులు ఉండే కంటోన్మెంట్ ఏరియాలలో వారికి అండగా ఉంటూ సహకరించాలని కోరారు. తన జన్మదినం సందర్భంగా, తనను గెలిపించి ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.