calender_icon.png 9 May, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సంస్థాగత’ సమయమెప్పుడో?

09-05-2025 01:25:35 AM

-బీఆర్‌ఎస్‌లో కొత్త కమిటీల కోసం శ్రేణుల ఎదురుచూపు

-పూర్తిస్థాయి కమిటీలతోనే పార్టీకి నూతన జవసత్వాలు

-పల్లె నుంచి బలోపేతం చేయాలని అధినాయకత్వానికి సూచన

-రజతోత్సవ సభ తర్వాత ఉంటుందన్న అగ్రనేతలు

-తొందరగా ఏర్పాటు చేయాలంటున్న క్యాడర్

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సంస్థాగత నిర్మాణం ఎప్పుడంటూ పార్టీ శ్రేణులు ఆసక్తిగా  ఎదురుచూ స్తున్నాయి. 2021లో పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన పార్టీ అధినాయకత్వం యువజన, మహిళ, విద్యార్థి, కార్మిక తదితర అనుబంధ సంఘాల కమిటీలను నియమించింది. 2022లో జిల్లా అధ్యక్షులను నియ మించింది.

ఆ తర్వాత 2022అక్టోబర్‌లో టీఆర్‌ఎస్ పేరు మారి బీఆర్‌ఎస్‌గా ఏర్పడింది. 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర సీనియర్ నేతలు, మాజీమంత్రులు అసెంబ్లీ ఎన్నికలపై పలు సమీక్షలు నిర్వహించారు.

ఆ సమీక్షల్లో మెజార్టీ పార్టీ కార్యకర్తలు పార్టీని గ్రామస్థాయి నుంచి ప్రక్షాళన చేసి నూతన కమిటీలను ఏర్పాటు చేసి కొత్త జవసత్వాలు నింపాలని సూచించారు. అధినాయకత్వం కూడా ఓకే చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆర్నెళ్లకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. దీంతో పార్టీ శ్రేణులు డీలాపడ్డాయి. 

పార్టీ కార్యక్రమాలు విజయవంతం కావాలంటే..

క్యాడర్‌లో జోష్ నింపేందుకు పార్టీ ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది. అయితే పార్టీ కార్యక్రమాలు మరింత సక్సెస్ కావాలంటే పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి నుంచి చేపట్టాలని జిల్లా, రాష్ట్ర కమిటీలను వేసి పార్టీని ట్రాక్‌పైకి ఎక్కించాలని గులాబీ శ్రేణులు అనేక అంతర్గత సమావేశాల్లో అధినాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు.

దీనికి తగ్గట్లు గానే ఇటీవల పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు సందర్భంగా ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభ సన్నాహాక సమావేశాలను ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ జిల్లాల వారీగా నిర్వహించారు. ఆ సందర్భంగా హాజరైన నేతలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ.. సభ ముగిసిన అనంతర రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తామని, సభ్యత్వనమోదు, శిక్షణా తరగతులు, పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతామని చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమా లు సభ ముగిసిన వెంటనే ప్రారంభం అవుతాయన్నట్లుగా కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. ఇక కేటీఆర్ కూడా రజతోత్సవ సభ సన్నాహాక సమావేశాల్లో అనేకసార్లు ఎల్కతుర్తి సభ కాగానే మే చివరి వారంలో సభ్యత్వ నమోదు చేస్తామని అది కూడా పూర్తి డిజిటల్ విధానంలో ఉంటుందని చెప్పారు.

జిల్లా, రాష్ట్ర కమిటీల నిర్మాణం, అన్ని జిల్లాల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. ప్రతీ నెల ఒక కార్యక్రమంతో ఏడాది పొడవునా పార్టీ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత అధ్యక్షుడి ఎన్నిక కూడా నిర్వహించుకుందామని అన్నారు.

అయితే ఎల్కతుర్తి రజతోత్సవ సభ జరిగిన మర్నాడు కేటీఆర్ జిమ్‌లో వ్యాయా మం చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడ్డారు. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయ న ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 

తొందరగా దృష్టిసారించాలి..

కేటీఆర్ కోలుకున్న తర్వాత పార్టీ కార్యక్రమాలు అంతకుముందు అనుకున్నట్లుగానే నిర్మాణంపైనా దృష్టి పెట్టే వీలుందని బీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు. కొద్దిరోజులు అటుఇటూ అయినా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన అధినాయకత్వానికి ఉందని ఓ సీనియర్ నేత చెప్పారు.

ఓటమిభారంతో ఉన్న పార్టీ మళ్లీ స్పీడందుకొని ప్రజల్లోకి వెళ్లాలంటే, ప్రజాసమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడాలంటే కమిటీల ఏర్పాటు, పార్టీ నిర్మాణంపై వీలైనంత తొందరగా దృష్టి సారించాలని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి.