09-05-2025 12:57:36 AM
పాకిస్థానీ నటీనటులు మహీరాఖాన్, ఫవాద్‌ఖాన్‌లపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) మండిపడింది. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై వారు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసోసియేషన్ స్పందించింది. మహీరాఖాన్ భారత సైనం చేపట్టిన చర్యను పిరికిపంద చర్యగా అభివర్ణించగా, ఫవాద్‌ఖాన్ ఉగ్రవాదాన్ని ఖండించకుండా భారతదేశ వైఖరిని విమర్శించాడు.
వారు చేసిన ఈ వ్యాఖ్యలను ఏఐసీడబ్ల్యూఏ ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వారి కామెంట్స్ మన దేశాన్ని అగౌరవపరిచేలా ఉన్నాయని పేర్కొంది. అంతేకాక ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకులను, దేశం కోసం ప్రాణత్యాగం చేసి సైనికులను అవమానించేలా ఉన్నాయని తెలిపింది. మన చిత్ర పరిశ్రమలో పనిచేసే పాకిస్థానీ కళాకారులు, నిర్మాతలపై పూర్తిగా నిషేధం విధిం చాలని కోరింది.
భారతీయులెవరూ వీరిని అభిమానించొద్దని, కళ పేరుతో ఇలాంటి కళాకారులకు గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అగౌరవపర్చడమే అవుతుందని ఇండస్ట్రీ అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్న మైందని అభిప్రాయపడింది. భారతీయ గాయనీగాయకులు పాక్ సింగర్స్‌తో వేదికలను పంచుకోవద్దని, జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా అసోసియేషన్ సూచించింది.