22-09-2025 01:15:16 AM
-సూపర్ కూడా పాక్‌కు తప్పని ఓటమి
-బౌలింగ్‌లో రఫ్పాడించిన దూబే, బ్యాటింగ్‌లో అభి‘షేక్’
-స్ట్రుక్ బౌలర్లకు చుక్కలు చూపెట్టిన ఓపెనర్లు
-పాక్‌కు మరోసారి తప్పని ‘షేక్ హ్యాండ్’ సెగ
-ఓవరాక్షన్ చేసిన పాక్ ఓపెనర్
-డైనమెట్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’
దుబాయ్, సెప్టెంబర్ 21: ఫాఫం పాకిస్థాన్‌కు మరో ఓటమి తప్పలేదు. ఆదివారం జరిగిన ఆసియా కప్ సూపర్ పోరులో కూడా ఆ జట్టుకు ఓటమే ఎదురైంది. టీమిండియా 6 వికెట్ల తేడాతో పాక్‌పై గెలిచి సత్తా చాటింది. పాక్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని సూర్య సేన 18.5 ఓవర్లలోనే ఛేదించి అమోఘమైన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇండియా నిర్ణయంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు పర్వాలేదనే ఆరంభమే లభించింది.
మూడో ఓవర్లో ఇండియన్ ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా పాక్ ఓపెనర్ ఫఖార్ జమాన్ (15) వికెట్ తీసి మొదటి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఇక పాక్‌కు మళ్లీ పాత కథే పునరావృతం అవుతుందని భావించిన ఇండియన్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. మరో ఓపెనర్ ఫరాన్ (58) వన్ డౌన్ బ్యాటర్, ఆల్‌రౌండర్ సయీమ్ అయూబ్ (21)తో కలిసి భారత బౌలర్లకు పరీక్ష పెట్టాడు. 50+ పరుగులు జోడించిన ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు 11వ ఓవర్లో సయీమ్ ఆయూబ్‌ను ఆల్‌రౌండర్ శివందూబే పెవిలి యన్‌కు చేర్చి.. ఈ జోడీని విడదీశాడు. ఇక తర్వాత పాక్ ప్లేయర్లు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయారు.
దీంతో పాక్ 150 పరుగులు కూడా చేయడం కష్టమే అని అంతా భావించారు. చివరి మూడు ఓవర్లలో పాక్ భారీగా పరుగులు చేయడంతో ఆ జట్టు 150 పరుగుల మార్కును క్రాస్ చేసింది. భారత తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో 45 పరులివ్వడం గమనార్హం. బుమ్రా తన టీ20 కెరియర్‌లో ఇంత ధారాళంగా ఎన్నడూ పరుగులివ్వలేదు. భారత బౌలర్లలో శివం దూబే రెండు, పాండ్యా, కుల్దీప్ చెరో వికెట్ తీసుకున్నారు. పాకిస్థాన్ పవర్‌ప్లేలో 55 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. పాక్‌ను షేక్ ఆడించిన ఇండియన్ డైనమెట్ అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
షేక్ ఆడించిన ఓపెనర్లు.. తొలి బంతికే సిక్స్
172 పరుగల లక్ష్యంతో ఛేజింగ్‌ను మొదలుపెట్టిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఓపెనర్లుగా వచ్చిన గిల్ (47), అభిషేక్ శర్మ (74) పాక్ బౌలర్లకు చుక్కలు చూపెట్టారు. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మ సిక్స్ కొట్టాడు. పాక్ స్ట్రుక్ బౌలర్ షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో తొలి బం తినే సిక్స్‌గా మలచడంతో పాక్ ఆటగాళ్లు, అ భిమానులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టి నివ్వెరపోయారు.
అక్కడి నుంచి ఏ ఒక్క బౌలర్‌ను కూడా ఈ జోడీ విడిచిపెట్టలేదు. ఈ జోడీ తొలి వికెట్‌కు 100 పరుగుల జోడించిన తర్వాత గిల్ ఔటయ్యాడు. అభిషేక్ అర్ధ సెంచరీ చేసినా గిల్ తృటిలో అర్ధ సెంచరీ మిస్ చేసుకున్నాడు. గిల్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్కై పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన భారత బ్యాటర్లు కాసింత కంగారు పెట్టినా కానీ చివరికి మ్యాచ్‌ను మాత్రం గెలిచారు.
18.5 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ ఓటమితో ఆసియాకప్‌లో పాక్‌పై భారత్ గెలిచిన మ్యాచుల సంఖ్య 3కి చేరుకుంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. యూఏఈతో మ్యాచ్ సందర్భంగా ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని బెదిరించిన పాకిస్థాన్ మళ్లీ గత్యంతరం లేక ఆడిన సంగతి తెలిసిందే. ఆండీ పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పాడని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పాక్‌కు గట్టి షాక్ తగిలింది. ఆదివారం మ్యాచ్‌లో కూడా రిఫరీగా అండీ పైక్రాఫ్ట్‌నే ఐసీసీ నియమించింది. అయినా పాక్ కిక్కురుమనకుం డా ఆడి ఓడిపోయింది.
ఆగాకు తప్పని అవమానం..
పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగాకు మరోసారి పరాభవం తప్పలేదు. టాస్ టైమ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆగాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. గ్రూప్ మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌కు హాజరుకాని ఆగా సూపర్ మ్యాచ్ అనంతరం మా త్రం సెర్మనీకి హాజరయ్యాడు. మాడిపోయిన ముఖంతో వచ్చిన ఆగా మినహా పాక్ క్రికెటర్లెవరూ ఈ సెర్మనీకి హాజరుకాలేదు. ఇండి యా తరఫున కూడా స్కై, అభిషేక్, దూబే మాత్రమే హాజరయ్యారు. అభిషేక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, దూబేకు ‘గేమ్ చేంజర్’ అవార్డులు రావడంతో వారిద్దరూ కెప్టెన్ సూర్య తో కలిసి వచ్చారు. ఈ మ్యాచ్‌లో కూడా భారత ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం గమనార్హం.
పాక్ ఓపెనర్ ఓవరాక్షన్..
పాక్ ఓపెనర్ ఫరాన్ హాఫ్ సెంచరీ అనంతరం ఓవరాక్షన్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అతగాడి సెలబ్రేషన్స్ మితిమీరాయి. బ్యాట్‌ను తుపాకీలా ఎక్కుపెట్టి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఏదో మ్యాచ్ గెలిపించినట్టు.. కొత్త రికార్డు నెలకొల్పినట్టు ఫరాన్ చేసిన ఓవరాక్షన్‌పై నెట్టింట మీమ్స్, జోక్స్ ఓ రేంజ్‌లో పేలుతున్నాయి. మరి ఇంతలా ఓవరాక్షన్ చేస్తే మ్యాచ్ గెలిచిందా అంటే అదీ లేదు. ఎలాగూ గెలుపు కష్టమే అని తెలిసి కూడా ఓవరాక్షన్ చేశాడు. అదే భారత బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసినా ఎటువంటి యాక్షన్ చేయలేదు. మరి ఫరాన్‌కు అంత ఓవరాక్షన్ ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.