19-12-2025 12:37:26 AM
హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : రాష్ట్రం లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్ర వ్యప్తంగా ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల విధుల్లో పాల్గొని మరణించిన ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, ఆసిఫాబాద్ మిషన్ భగీరథ ఏఈ కట్ట రాజు కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్లను ఈసీ ఆదేశించింది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా 12,727 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేయగా, కొన్ని చోట్ల వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1205 గ్రామాలు, 25,848 వార్డులు ఏకగ్రీవం కాగా, 11,497 సర్పంచ్, 85,955 వార్డులకు ఎన్నికలు జరిగాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 85.30 శాతం ఓటింగ్ నమోదైందని, 1 కోటి 35 లక్షల 23 వేల 137 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.