19-12-2025 12:36:50 AM
పాలమూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
మహబూబ్ నగర్ డిసెంబర్ 18(విజయక్రాంతి): దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతామని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణ చౌరస్తా నుంచి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించగా కార్యాలయ సమీపంలో పోలీసులు భారీకెడ్లు ఏర్పాటు చేశారు. భారీకేడ్డు దాటి కాంగ్రెస్ నాయకులు వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మీడియాతో డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు.
ప్రతిపక్షాలను భయభ్రాంతులకు చేయడానికి ఈడీ, సీబీఐలను ఇష్టానుసారంగా వాదుకుంటున్నదని విమర్శించారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గట్టిగా ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్ అనేది కేవలం జర్నలిజంకు సంబంధించినదని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పట్ల బీజేపీ అవలంభిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. దేశంలో బీజేపీని భూస్థాపితం చేసేవరకు పోరాడుతామని హెచ్చరించారు. నిరసనలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, నాయకులు వినోద్ కుమార్, మిథున్ రెడ్డి, సీజే బెనహర్, అజ్మత్ ఆలీ, బెక్కరి మధుసూదన్ రెడ్డి ఫయాజ్, ఆవేజ్, రాములు యాదవ్, నాగరాజు, ప్రవీణ్ కుమార్ తో పాటు జిల్లాలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నూతనంగా గెలుపొందిన గ్రామ పంచాయతీల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.