calender_icon.png 3 August, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం కాంగ్రెస్‌లో పంచాయితీ?

25-07-2025 12:22:45 AM

  1. తాజా, మాజీ ఎమ్మెల్యేల అంతర్యుద్ధం
  2. వెంకట్రావు అనుచరుడిపై పొదెం వీరయ్య అనుచరుల దాడి?
  3. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే అనుచరుడు

భద్రాచలం, జూలై 24: భద్రాద్రి జిల్లా భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్‌లో రోజురోజుకూ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, అటవీ కార్పొరేషన్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య మధ్య అంతర్యుద్ధం నడుస్తున్నది. అనుచరులు పరస్పర దాడులు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. గత నెల రోజుల క్రితం దుమ్ముగూడెం మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో నిజమైన కార్యకర్తలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, సంక్షేమ పథకాలు అందటం లేదని మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య దృష్టికి కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకెళ్లారు. ఆ సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ.. ఈ విషయం వాస్తమని, ప్రస్తుత ఎమ్మెల్యే వెంకట్రావు నిజమైన కాంగ్రెస్‌వాది కానందునే కార్యకర్తలు సంక్షేమానికి దూరమవుతున్నారని చెప్పారు. ఈ విషయం పార్టీ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యే వెంకట్రావు అనుచరుడైన ఆటో డ్రైవర్ రాయల శ్రీను దానిని ఖండిస్తూ.. వెంకట్రావుకు అనుకూలంగా వీరయ్యని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ కారణంగా రెండు రోజుల తర్వాత ఇరువర్గాల వారు ఒక హోటల్ వద్ద ఘర్షణ పడ్డారు. ఈ సంఘటనపై రాయల శ్రీను భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇరువర్గాలను సీఐ మందలించి, ఫిర్యాదు వాపస్ తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.

రాజీకోసం రాయల శ్రీను మరొక వ్యక్తితో కలిసి పొదెం వీరయ్య ఇంటికి వెళ్లగా.. అక్కడ వీరయ్య అనుచరులైన కొంతమంది కొట్టినట్లు తెలిసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనును ఎమ్మెల్యే వెంకట్రావు గురువారం పరామర్శించారు. శ్రీను ద్వారా ఏఎస్పీకి ఫిర్యాదు చేయించారు. సమగ్రంగా విచారణ జరిపి ఎవరు తప్పు చేసినా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెంకట్రావు ఏఎస్పీ విక్రాంత్ సింగ్‌కుమార్‌ని కోరారు. 

స్థానిక ఎన్నికలపై ప్రభావం?

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ భద్రాచలం నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. బీఆర్‌ఎస్‌లో గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి.. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో పనిచేస్తున్న వారిని కాదని తన వెంట వచ్చిన బీఆర్‌ఎస్ కార్యకర్తలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే వీరయ్య అనుచరులు ఆరోపిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపునకు కృషి చేస్తున్నానని, భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అంటున్నారు. ఎమ్మెల్యే వెంకట్రావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు కాగా.. పొదెం వీరయ్య ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనుచరుడు. దీంతో పోలీసు అధికారులు కూడా ఇరు వర్గాలను మందలించే పరిస్థితి లేదు.