04-11-2025 01:04:20 AM
బీహార్, నవంబర్ 3: ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శనాస్త్రాలను ప్రయోగిస్తూ.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేడు ఇండియా కూటమిలో పప్పు, తప్పు, అప్పు అనే మూడు కొత్త కోతులు ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ వివాదాస్పదం చేసిన కశ్మీర్‌కు ప్రధాని మోదీ విముక్తి కల్పించారని, ప్రతిపక్ష పార్టీలు రామునికి వ్యతిరేకమని పేర్కొన్నారు. బీహార్‌లోని దర్భంగాలో సోమవారం జరిగిన బహిరంగ ర్యాలీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆర్జేడీల పనితీరుపై దుమ్మెత్తిపోశారు.
వారి పాలనలో రాష్ట్రంలో ఏమి జరిగిందో వివరించారు. ఆర్జేడీ విమర్శల అస్త్రాలను ప్రయోగించారు. వారి గత పాలనలో పేదలకు ప్రాథమిక అవసరాలు, సంక్షేమ ప్రయోజనాలు అందలేని ఆరోపించారు. మహాత్మాగాంధీ చెప్పిన మూడు కోతుల కథను గుర్తుచేస్తూ.. నేడు ఇండి యా కూటమిలో పప్పు, తప్పు, అప్పు అనే మూడు కొత్త కోతులు ఉన్నాయని తెలిపారు. పప్పు నిజం మాట్లాడలేడని, తప్పు సరైనది చూడలేడని, అప్పు నిజం వినలేడని వాటి గుణాలను వివరించారు.
కూటమి నేతలు ఎన్‌డీఏ ప్రభుత్వంలో అభివృద్ధిని చూడలేరు, వినలేరు, మాట్లాడలేరని ఆరోపించారు. కశ్మీర్‌ను కాంగ్రెస్ వివాదస్పదం చేసిందని, అయితే దానిని ఉగ్రవాదం నుంచి ప్రధాని మోదీ విముక్తి చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో హిందువుల తోపాటు మిథిల, బీహార్ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు రామునికి వ్యతిరేకమని సీఎం యోగి ఆరోపించారు.
రామ రథయాత్రను ఆపేందుకు ఆర్జేడీ ప్రయత్నించిందని, అయోధ్యలో రామ భక్తులపై కాల్పులు జరపాలని సమాజ్‌వాదీ పార్టీ ఆదేశించిందని విమర్శించారు. ఆర్జేడీ పాలనలో బీహార్‌లో 70కి పైగా మారణహోమాలు జరిగాయని చెప్పారు. ఈ పార్టీలు ప్రజలను కులాల వారీగా విభజించి, జాతీయ భద్రతను బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు.