calender_icon.png 25 November, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్‌చెరు ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్

25-11-2025 12:00:00 AM

-గూడెం మధుసూదన్‌రెడ్డి మైనింగ్‌లో రూ.300 కోట్ల అక్రమాలు?

-ప్రభుత్వానికి రూ.39 కోట్ల రాయల్టీ ఎగవేత!

-రూ.80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ 

-ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి తలనొప్పిగా మారిన వ్యవహారం

సంగారెడ్డి, నవంబర్ 24 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డికి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మధుసూదన్‌రెడ్డికి చెందిన సంతోష్ సాండ్, గ్రానైట్ కంపెనీ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి సుమారు రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడటమే కాకుండా రూ.39 కోట్ల రాయల్టీ ప్రభుత్వానికి చెల్లించలేదనే అభియోగంతో ఈడీ ఆయన ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిసింది. గత రెండేళ్ల క్రితమే జీవీఆర్ ఎంటర్ ప్రైజెస్ అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మైనింగ్ క్వారీలను సీజ్ చేయడమే కాకుండా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, సోదరుడు మధుసూదన్‌రెడ్డి ఇండ్లలో సోదాలు సైతం నిర్వహించారు. 

పటాన్‌చెరులో మారుతున్న పరిణామాలు

పటాన్‌చెరు ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్‌డ్డి మూడవసారి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయంగా పరిణా మాలు మారాయి. ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్‌రెడ్డి మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు అందడం, అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో రాజకీయ దుమారం చెలరేగింది.

కేవలం తన సోదరుడి అక్రమ మైనింగ్ వ్యవహారం కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ లోకల్ కాంగ్రెస్ నేతల మధ్య నువ్వానేనా అన్నట్లుగా గొడవలు జరిగాయి. ఏకంగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డుపై ధర్నా కూడా చేపట్టారు. ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారడంతో విచారణ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. తాజాగా ఈడీ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిందనే చెప్పొచ్చు. 

కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారనే?

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నప్పటికీ బీఆర్‌ఎస్ నేతలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్‌గౌడ్‌కే ప్రాధాన్యత ఇస్తుందనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఈడీ రెండేళ్ల తర్వాత ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులను అటాచ్ చేయడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. అయితే కక్షసాధింపు చర్యలో భాగంగానే ఈడీ ఆస్తులను అటాచ్ చేస్తుందని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు.